రూ.15,000లోపు ఫోన్ల మార్కెట్ కు త్వరలో శామ్ సంగ్ గుడ్ బై?

  • ఈ ఏడాది డిసెంబర్ తర్వాత తయారీ ఉండదు
  • ఇకపై ఆవిష్కరణలన్నీ రూ.15వేలకు పైన ధరలోనే
  • ఖరీదైన ఫోన్లపైనే దృష్టి సారించనున్న కొరియా కంపెనీ
కొరియా కంపెనీ శామ్ సంగ్ ఇండియాలో తక్కువ ఖరీదు ఉండే ఫీచర్ ఫోన్ల మార్కెట్ నుంచి తప్పుకోనుంది. అంతేకాదు, రూ.15,000 లోపు ఫోన్ల విక్రయాల నుంచి కూడా తప్పుకోవాలనే ప్రణాళికతో ఉన్నట్టు సమాచారం బయటకు వచ్చింది. ఇది కూడా ఒకేసారి కాకుండా క్రమంగా చేయనుందని తెలుస్తోంది. శామ్ సంగ్ కోసం ఫీచర్ ఫోన్లను డిక్సన్ టెక్నాలజీస్ తయారు చేసి ఇస్తుంటుంది. ఈ ఏడాది డిసెంబర్ తో చివరి బ్యాచ్ ఫోన్లను శామ్ సంగ్ కోసం తయారు చేయనుంది. ఆ తర్వాత నుంచి ఇక తయారీ ఉండదు. 

అధిక ధరల ఫోన్లపైనే దృష్టి సారించాలన్నది శామ్ సంగ్ ప్రణాళిక అని తెలుస్తోంది. వాస్తవానికి రూ.15,000 లోపు ఎక్కువ సంఖ్యలో ఫోన్లను శామ్ సంగ్ విక్రయిస్తుంటుంది. కానీ, లాభాల మార్జిన్ తక్కువ. ఖరీదైన ఫోన్లలో మార్జిన్ ఎక్కువ. అందుకని ఎక్కువ మార్జిన్లు ఉండే విభాగంపైనే దృష్టి పెట్టాలన్నది కంపెనీ ప్రణాళిక అని తెలుస్తోంది. ఇకపై శామ్ సంగ్ విడుదల చేసే ఫోన్లు అన్నీ కూడా రూ.15,000కుపైనే ఉంటాయని ఈ వ్యవహారం తెలిసిన ఓ వ్యక్తి వెల్లడించారు. 

ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద తయారీ ప్రోత్సాహకాలు, సబ్సిడీలకు శామ్ సంగ్ కూడా ఎంపికైంది. వీటి కింద ప్రయోజనాలు పొందాలంటే ఫ్యాక్టరీలో ఫోన్ తయారీ ధర రూ.15,000కు పైన ఉండాలన్నది నిబంధన. కనుక ఈ విధంగానూ ప్రయోజనాలు పొందొచ్చన్నది శామ్ సంగ్ ఆలోచన. 



More Telugu News