ఫటాఫట్ జయలక్ష్మిని పరిచయం చేసిన టాలీవుడ్ నిర్మాత రామకృష్ణారెడ్డి మృతి

  • అనారోగ్యంతో నిన్న రాత్రి రామకృష్ణారెడ్డి మృతి
  • 'అభిమానవంతులు' చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం
  • 1948లో గూడూరులో జన్మించిన రామకృష్ణారెడ్డి
తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత ఎం. రామకృష్ణారెడ్డి నిన్న రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 

1948 మార్చి 8వ తేదీన నెల్లూరు జిల్లా (ప్రస్తుతం తిరుపతి జిల్లా) గూడూరులో ఆయన జన్మించారు. మైసూరు యూనివర్శిటీలో బీఈ పూర్తి చేశారు. అనంతరం కొంతకొలం సిమెంట్ రేకుల వ్యాపారాన్ని నిర్వహించారు. ఆ తర్వాత తన బంధువు ఎంఎస్ రెడ్డి ప్రోత్సాహంతో ఆయన చిత్రసీమలోకి ప్రవేశించారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. 

ఫటాఫట్ జయలక్ష్మి, శోభానాయుడులను 'అభిమానవంతులు' చిత్రం ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం చేసింది రామకృష్ణారెడ్డే. 1973లో ఈ చిత్రాన్ని ఆయన తెరకెక్కించారు. 'వైకుంఠపాళి', 'గడుసుపిల్లోడు', 'సీతాపతి సంసారం', 'మావూరి దేవత', 'అల్లుడుగారు జిందాబాద్','అగ్ని కెరటాలు', 'మూడిళ్ల ముచ్చట' తదితర చిత్రాలను నిర్మించారు. 'అమ్మోరుతల్లి' చిత్రాన్ని డబ్ చేశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News