జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. టీవీ నటి కాల్చివేత

  • పదేళ్ల మేనల్లుడితో కలిసి ఇంటి బయట ఉన్న సమయంలో ఉగ్రవాదుల కాల్పులు
  • తీవ్ర గాయాలతో మరణించిన అమ్రీన్ భట్.. చికిత్స పొందుతున్న మేనల్లుడు
  • బారాముల్లా జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు దారుణానికి తెగబడ్డారు. ఓ టీవీ నటిని కాల్చి చంపారు. బుద్గాం జిల్లా చదూర ప్రాంతంలో గత రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీవీ నటి అయిన అమ్రీన్ భట్ (35) పదేళ్ల వయసున్న తన మేనల్లుడితో కలిసి ఇంటి బయట ఉన్న సమయంలో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఆమెపై కాల్పులు జరిపారు.

 మెడలోంచి బుల్లెట్ దూసుకెళ్లడంతో అమ్రీన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆమె మేనల్లుడు ఫర్హాన్ జుబైర్ చేతికి బుల్లెట్ గాయాలయ్యాయి. వీరిద్దరిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అమ్రీన్ ప్రాణాలు కోల్పోయారు. ఫర్హాన్‌కు చికిత్స అందిస్తున్నారని, అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించారు. కాగా, అమ్రీన్‌కు టిక్‌టాక్, యూట్యూబ్‌లలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె వీడియోలకు పెద్ద ఎత్తున వ్యూస్ వస్తుంటాయి. మరోవైపు, నిన్న బారాముల్లా జిల్లాలోని క్రీరీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమవగా ఓ పోలీసు వీరమరణం పొందాడు.


More Telugu News