బెంగళూరును క్వాలిఫయర్‌కు చేర్చిన రజత్ పటీదార్.. పోరాడి ఓడిన లక్నో

  • ఐపీఎల్‌లో తొలి శతకం నమోదు చేసిన పటీదార్
  • బ్యాటింగ్‌లో తడబడిన లక్నో సూపర్ జెయింట్స్
  • మూడు వికెట్లు తీసి రాహుల్ సేనను దెబ్బకొట్టిన హేజిల్‌వుడ్
  • ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన లక్నో
కీలక మ్యాచ్‌లో బెంగళూరు చెలరేగింది. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ లాంటి బ్యాటర్లు ఉుసూరుమనించినా రజత్ పటీదార్ శతకంతో విరుచుకుపడి జట్టును క్వాలిఫయర్-2కు చేర్చాడు. గత రాత్రి కోల్‌కతాలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 14 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు మరొక్క మ్యాచ్ దూరంలో నిలిచింది. రేపు రాజస్థాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో విజయం సాధిస్తే టైటిల్‌ పోరుకు అర్హత సాధిస్తుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 207 పరుగుల భారీ స్కోరు సాధించింది. గత మ్యాచ్‌లో మెరిసిన కోహ్లీ (25) ఈసారి నిరాశపరిచాడు. కెప్టెన్ డుప్లెసిస్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. అయితే, క్రీజులోకి వచ్చిన రజత్ పటీదార్ మాత్రం తగ్గేదే లేదన్నట్టు బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు. 

బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఐపీఎల్‌లో తొలి శతకం నమోదు చేశాడు. 54 బంతుల్లోనే 12 ఫోర్లు, 7 సిక్సర్లతో అజేయంగా 112 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో దినేశ్ కార్తీక్ బ్యాట్‌కు పనిచెప్పాడు. 23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌తో 37 పరుగులు చేయడంతో ఆర్సీబీ 207 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. 

ఇక మ్యాక్స్‌వెల్ 9, లోమ్రోర్ 14 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో మోసిన్ ఖాన్, కృనాల్ పాండ్యా, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్ తలా ఓ వికెట్ తీసుకున్నారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పటీదార్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

ఈ సీజన్‌లో అడుగుపెట్టడంతోనే అద్భుత విజయాలు సాధిస్తూ ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న లక్నో 208 పరుగులు భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు చివరి వరకు పోరాడింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 79 పరుగులు చేసినప్పటికీ వృథా అయింది. రాహుల్ తర్వాత దీపక్ హుడా ఒక్కడే కాస్తంత మెరుగ్గా ఆడాడు. 26 బంతుల్లో ఫోర్, 4 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. 

ఇక మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోయారు. ఫలితంగా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగులు మాత్రమే చేయగలిగింది. డికాక్ (6), మనన్ వోహ్రా (19), స్టోయినిస్ (9), ఎవిన్ లూయిస్ (2), కృనాల్ పాండ్యా (0) దారుణంగా విఫలమయ్యారు. ఫలితంగా గెలుపు ముంగిట బోల్తాపడి ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. బెంగళూరు బౌలర్లలో జోష్ హేజిల్‌వుడ్ 3 వికెట్లు తీసుకున్నాడు.


More Telugu News