'శ‌త‌క'బాదిన ర‌జ‌త్ ప‌టిదార్‌!... 207 పరుగులు చేసిన బెంగ‌ళూరు జ‌ట్టు!

  • 49 బంతుల్లోనే సెంచ‌రీ చేసిన ప‌టిదార్‌
  • మ‌రోమారు చెల‌రేగిన దినేశ్ కార్తీక్‌
  • కీల‌క మ్యాచ్‌లో విఫ‌ల‌మైన బెంగ‌ళూరు కెప్టెన్ డుప్లెసిస్‌
  • ల‌క్నో ల‌క్ష్యం 208 ప‌రుగులు
ఐపీఎల్ తాజా సీజ‌న్‌లో ఎలిమినేట‌ర్-1 మ్యాచ్‌లో బెంగ‌ళూరు జ‌ట్టు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు దిగిన బెంగ‌ళూరు జ‌ట్టు ఆదిలోనే కెప్టెన్ డుప్లెసిస్ వికెట్ కోల్పోయినా ఏమాత్రం వెరువ‌కుండా సత్తా చాటింది.

బెంగ‌ళూరు యువ బ్యాట‌ర్ ర‌జ‌త్ ప‌టిదార్ ల‌క్నో జూప‌ర్ జెయింట్స్ బౌల‌ర్ల‌ను ఓ ఆట ఆడుకున్నాడు. కేవ‌లం 49 బంతుల్లోనే సెంచ‌రీ పూర్తి చేసుకున్న ప‌టిదార్ ఇన్నింగ్స్ చివ‌రి దాకా క్రీజులోనే నిల‌దొక్కుకున్నాడు. మొత్తంగా 54 బంతులను ఆడిన పటిదార్... 12 ఫోర్లు, 7 సిక్స్ ల సాయంతో 112 పరుగులు చేశాడు. 

ఇక ఎప్ప‌టిమాదిరే మిడిలార్డ‌ర్‌లో వ‌చ్చిన దినేశ్ కార్తీక్(37) ఈ మ్యాచ్‌లోనూ బ్యాటును ఝుళిపించాడు. కాస్తంత నిల‌క‌డ‌గానే కొన‌సాగిన విరాట్ కోహ్లీ (25) ప‌రుగులు చేసి ఫ‌ర‌వాలేద‌నిపించాడు. వెర‌సి 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి బెంగ‌ళూరు జ‌ట్టు 207 ప‌రుగులు చేసింది.

ఇక అరంగేట్రం చేసిన సీజ‌న్‌లోనే స‌త్తా చాటి ప్లే ఆఫ్స్ చేరుకున్న ల‌క్నో జ‌ట్టు బెంగ‌ళూరు జ‌ట్టు బ్యాట‌ర్ల‌ను ప్ర‌త్యేకించి ర‌జ‌త్ ప‌టిదార్‌ను నిలువరించ‌లేక‌పోయింది. దినేశ్ కార్తీక్‌ను కూడా బెంగ‌ళూరు బౌల‌ర్లు నిలువ‌రించ‌లేక‌పోయారు. దుష్మంత చ‌మీరా వేసిన 19వ ఓవ‌ర్‌లో బెంగ‌ళూరు జ‌ట్టు ఏకంగా 21 ప‌రుగులు పిండుకుంది. ఫ‌లితంగా 4 ఓవ‌ర్లు వేసిన చ‌మీరా త‌న స్పెల్‌లో ఏకంగా 54 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. 

ఇక మిస్ట‌రీ స్పిన్న‌ర్ ర‌వి బిష్ణోయి కూడా 4 ఓవ‌ర్లు వేసి 45 ప‌రుగులు ఇచ్చాడు. బిష్ణోయి స‌హా అవేశ్ ఖాన్‌, కృణాల్ పాండ్యా, మోహిసిన్ ఖాన్ త‌లో వికెట్ తీసుకున్నారు. మ‌రికాసేప‌ట్లో ల‌క్నో జ‌ట్టు 208 ప‌రుగుల విజ‌య‌ల‌క్ష్యంతో త‌న ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నుంది.


More Telugu News