అమలాపురం దాడుల్లో ప్రధాన వ్యక్తి అన్యం సాయి వైసీపీ నాయకుడే అంటున్నారు: రఘురామకృష్ణరాజు

  • సజ్జలతో అన్యం సాయి ఫొటోలు దిగాడన్న రఘురాజు 
  • కోనసీమ జిల్లా పేరుపై ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ 
  • మెజార్టీ ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలని సూచన 
అన్యం సాయి అనే వ్యక్తి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో ఫొటోలు దిగారని... విశ్వరూప్ మంత్రి అయిన సమయంలో అమలాపురంలో ఫ్లెక్సీలు కట్టారని... నిన్న అమలాపురంలో జరిగిన దాడుల్లో అతనే ప్రధాన వ్యక్తి అని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సాయి వైసీపీ నాయకుడని చాలా మంది మాట్లాడుకుంటున్నారని తెలిపారు. 

ఇక రాష్ట్రంలో ఎక్కువ మంది కోరుకున్న వ్యక్తి  సీఎం అయినప్పుడు... అదే విధంగా ఎక్కువ మంది కోరిక మేరకు కోనసీమ జిల్లాపై ఓ నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. జిల్లాల పేర్ల మీద గతంలో కూడా వివాదాలు రేగాయని... చాలా చోట్ల ప్రజాభిప్రాయాన్ని తీసుకున్నారని చెప్పారు. 

కోనసీమ జిల్లా పేరుపై కూడా ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని సూచించారు. అంబేద్కర్ ను అభిమానించని వ్యక్తి ఏ కులంలో కూడా ఉండరని.. అన్ని కులాల వారు ఆరాధించే వ్యక్తి అంబేద్కర్ అని చెప్పారు. జిల్లా పేరు విషయంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించి, మెజార్టీ ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలని అన్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఎంత మంది ప్రజలు సమర్థిస్తున్నారనే విషయంపై ప్రజాభిప్రాయాన్ని నిర్వహించాలని చెప్పారు. 

అమలాపురం మొత్తం కాకపోయినా... లాటరీ పద్ధతిలో కొన్ని ప్రాంతాల్లో ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని... ఆ ప్రాంతాల్లో కనీసం లక్షకు తక్కువ కాకుండా ఓటింగ్ పెట్టాలని చెప్పారు. బ్యాలెట్ విధానంలో ఓటింగ్ కు వెళ్లాలని అన్నారు. కష్టం కాదు, ఇబ్బంది లేదనుకుంటే జిల్లా మొత్తం ఓటింగ్ నిర్వహించాలని సూచించారు. ఓటింగ్ లో ఫలితాన్ని అందరూ గౌరవిస్తారని చెప్పారు. ఓటింగ్ లో వచ్చిన ఫలితాన్ని ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో ఉండదని అన్నారు.


More Telugu News