గొడ‌వ‌లు జ‌ర‌గాల‌ని అభ్యంత‌రాల‌కు గడువిచ్చారా?: కోన‌సీమ అల్ల‌ర్ల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్‌

  • భావోద్వేగాలు ఉంటాయ‌ని తెలిసే రెచ్చ‌గొట్టారన్న పవన్ 
  • అభ్యంత‌రాల‌కు వ్య‌క్తులుగానే రావాల‌ని ‌ప్రకటించడం రెచ్చ‌గొట్టేదిగానే వుందంటూ విమర్శ 
  • అల్ల‌ర్ల‌పై పోలీసుల‌కు ముందుగానే స‌మాచారం ఉందని ఆరోపణ 
  • గొడ‌వ‌లు జ‌రుగుతున్నా పోలీసులు స్పందించ‌లేదన్న ప‌వ‌న్
కోన‌సీమ జిల్లాలో చోటుచేసుకున్న అల్ల‌ర్ల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందించారు. ఘ‌ర్ష‌ణ‌లు జ‌ర‌గాల‌న్న ఉద్దేశ్యంతోనే జిల్లా పేరు మార్పుపై అభ్యంత‌రాల‌కు ప్ర‌భుత్వం గ‌డువు ఇచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఈ మేరకు బుధ‌వారం మ‌ధ్యాహ్నం మంగ‌ళ‌గిరిలోని జ‌న‌సేన కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడారు. 

అస‌లు జిల్లాల ఏర్పాటు స‌మ‌యంలోనే కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరు పెడితే స‌రిపోయేది క‌దా?అంటూ ఆయ‌న ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. అస‌లు కోన‌సీమ జిల్లాకు అంబేద్క‌ర్ పేరు పెట్టే విష‌యంలో వైసీపీ ప్ర‌భుత్వం ఎందుకు జాప్యం చేసిందో అర్థం కావ‌డం లేద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు.

కోన‌సీమ‌లో భావోద్వేగాలు ఉంటాయ‌న్న విష‌యం తెలిసే జ‌నాన్ని రెచ్చ‌గొట్టిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆరోపించారు. జిల్లాల‌కు వ్య‌క్తుల పేర్లు పెట్టిన‌ప్పుడు ఇదివ‌ర‌కు ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న జారీ చేసేద‌ని, అయితే, కోన‌సీమ జిల్లా పేరు మార్పు సంద‌ర్భంగా వైసీపీ ప్ర‌భుత్వం అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించింద‌ని విమర్శించారు. 

జిల్లా పేరు మార్పుపై అభ్యంత‌రాల‌కు 30 రోజుల గ‌డువు విధించిన ప్ర‌భుత్వం...క‌లెక్ట‌రేట్‌కు వ‌చ్చి అభ్యంత‌రాలు తెల‌పాల‌ని కోరింద‌ని ప‌వ‌న్ చెప్పారు. అయితే అలా వ‌చ్చేవారు స‌మూహంగా రాకూడ‌ద‌ని, వ్య‌క్తులుగా మాత్రమే రావాలని ప్ర‌క‌ట‌న చేయడం అంటే ప్ర‌భుత్వం కోనసీమ జిల్లా ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్ట‌డ‌మేన‌ని ఆయ‌న తెలిపారు. ఈ ప్ర‌క‌ట‌న ముమ్మాటికి వ్య‌క్తుల‌ను టార్గెట్ చేయ‌డ‌మేన‌ని కూడా ఆయ‌న అన్నారు.  

ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌డంలో సీఎం జ‌గ‌న్ నేర్ప‌రి అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంత‌బాబు కేసులో ఇరుక్కుంటే... ప్ర‌జ‌ల దృష్టిని దానిపై నుంచి మ‌ర‌ల్చేందుకే కోన‌సీమ జిల్లా అల్ల‌ర్ల‌కు ప్లాన్ చేశార‌ని ప‌వ‌న్ ఆరోపించారు. మంత్రి విశ్వ‌రూప్ ఇంటిపై జ‌రిగిన దాడిలో పోలీసులు వ్య‌వ‌హ‌రించిన తీరే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని కూడా ఆయ‌న చెప్పారు. 

మంత్రి ఇంటిపై దాడి జ‌రుగుతుంటే ప్రేక్ష‌క‌పాత్ర పోషించిన పోలీసులు...దాడి జ‌రుగుతున్నా అడ్డుకునేందుకు య‌త్నించ‌లేద‌న్నారు. దాడికి ముందు మంత్రి కుటుంబాన్ని అక్క‌డి నుంచి త‌ర‌లించారంటే... మంత్రి ఇంటిపై దాడి జ‌రుగుతుంద‌ని పోలీసుల‌కు ముందే తెలిసిన‌ట్లే క‌దా? అని ఆయ‌న వ్యాఖ్యానించారు. గొడ‌వ‌లు జ‌రిగేలా ప్లాన్ చేసిన అధికార పార్టీ అల్ల‌ర్లకు జ‌న‌సేన‌దే బాధ్య‌త అంటూ ప్ర‌క‌టిస్తోంద‌ని ప‌వ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


More Telugu News