ఐపీఎల్ లో మెప్పించిన ఆటగాళ్లు ఎవరో చెప్పిన గంగూలీ

  • ఉమ్రాన్ మాలిక్ దీర్ఘకాలం పాటు ఆడతాడన్న గంగూలీ 
  • అతడి భవిష్యత్తు అతడి చేతుల్లోనే ఉందని వ్యాఖ్య  
  • ఫిట్ నెస్, పేస్ కాపాడుకోవాలని సూచన 
  • తిలక్ వర్మ, తెవాతియా, త్రిపాఠీ బాగా ఆడారంటూ ప్రశంసలు 
సన్ రైజర్స్ హైదరాబాద్ సంచలన పేసర్ ఫాస్టెస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్.. ఇదే నిలకడైన పనితీరు చూపిస్తే కనుక దీర్ఘకాలం పాటు అతడు టీమిండియాకు ఆడతాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికాతో దేశీయంగా త్వరలో మొదలయ్యే ఐదు టీ20ల సిరీస్ కు ఉమ్రాన్ మాలిక్ సహా 18 మందిని బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేయడం తెలిసిందే. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో చాలా మంది ప్రతిభావంతులు వెలుగులోకి వచ్చినట్టు గంగూలీ అభిప్రాయపడ్డారు.

మాలిక్ టీమిండియా తరఫున ఆడడం ఇదే మొదటిసారి కానుంది. ఐపీఎల్ లో 155 కిలోమీటర్ల వేగంతో అతడు బంతులు సంధించడం సంచలనాన్ని సృష్టించింది. దీనిపై గంగూలీ స్పందిస్తూ.. ‘‘అతడి భవిష్యత్తు అతడి చేతుల్లోనే ఉంది. పూర్తి ఫిట్ నెస్ తో, ఇదే వేగంతో బంతులను సంధిస్తే దీర్ఘకాలం పాటు ఆడగలడు’’ అని గంగూలీ పేర్కొన్నారు. 

ఐపీఎల్ 2022 సీజన్ లో ప్రతిభ చూపిన ఆటగాళ్ల గురించి చెబుతూ.. ‘‘ఐపీఎల్ లో చాలా మంది చక్కగా ఆడారు. తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ తరఫున చక్కగా రాణించాడు. సన్ రైజర్స్ నుంచి రాహుల్ త్రిపాఠి, గుజరాత్ నుంచి తెవాతియా మంచి ప్రదర్శన ఇచ్చారు. మాలిక్, మోహిసిన్ ఖాన్, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్ వంటి వర్ధమాన ఫాస్ట్ బౌలర్లు వెలుగులోకి వచ్చారు. ప్రతిభను ప్రదర్శించుకునే వేదిక ఇది (ఐపీఎల్)’’ అని గంగూలీ చెప్పారు. 


More Telugu News