ఉక్రెయిన్‌లో రష్యా మానవ హననం.. అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో 200 మృతదేహాలు!

  • శిథిలాలు తొలగిస్తున్న క్రమంలో బయటపడిన మృతదేహాలు
  • మేరియుపోల్‌లో ఇప్పటి వరకు 21 వేల మందిని పొట్టనపెట్టుకుందన్న ఉక్రెయిన్
  • రష్యా ఇప్పటి వరకు 1,474 సార్లు క్షిపణులు ప్రయోగించిందన్న జెలెన్‌స్కీ
ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యా దారుణాలకు అంతుపొంతు లేకుండా పోతోంది. అమాయకులను మట్టుబెడుతున్న రష్యన్ సైన్యం ఆ దారుణాలు వెలుగులోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే, ఎంత జాగ్రత్తలు తీసుకున్నా తాజాగా బయటపడిన ఓ నిజం ప్రపంచాన్ని నిర్ఘాంతపోయేలా చేస్తోంది. భీకర పోరాటం తర్వాత ఇటీవల మేరియుపోల్‌ను స్వాధీనం చేసుకున్న రష్యా దళాలు అక్కడ ఒడిగట్టిన దారుణమారణకాండ వెలుగుచూసింది. 

రష్యా దాడిలో పూర్తిగా ధ్వంసమైన మేరియుపోల్‌లో శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్ నుంచి ముక్కుపుటాలు అదిరిపోయే దుర్గంధం వచ్చింది. లోపలికి వెళ్లి చూసిన అధికారులు అక్కడి దృశ్యాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు. దాదాపు 200 వరకు మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. రష్యా దాడుల్లో నగరంలో దాదాపు 21 వేల మంది మృతి చెందినట్టు ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. అయితే, సంచార దహనవాటికలతోపాటు సామూహిక పూడ్చివేతలు చేపడుతూ ఈ దారుణాలు వెలుగులోకి రాకుండా రష్యా జాగ్రత్తపడుతోందని ఉక్రెయిన్ ఆరోపించింది.

మరోవైపు, ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. సీవియెరోదొనెట్స్క్, దాని చుట్టుపక్కల నగరాలను చుట్టుముట్టిన రష్యా దళాలు వాటిని పూర్తిగా దిగ్బంధం చేసేందుకు పెద్ద ఎత్తున బలగాలను మోహరించాయి. స్విట్లోడార్స్క్ పట్టణాన్ని స్వాధీనం చేసుకుని తమ జెండాను ఎగురవేశాయి. కాగా, యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్‌పైకి రష్యా 1,474 సార్లు క్షిపణులు ప్రయోగించిందని, వేర్వేరు రకాలకు చెందిన 2,275 క్షిపణుల్ని ఉపయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు.


More Telugu News