వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ ను పార్టీ నుంచి, పెద్దల సభ నుంచి పంపించేసే వాళ్లు: పవన్ కల్యాణ్

  • మాజీ డ్రైవర్ ను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్
  • వైసీపీ నేతల నుంచి శాంతి భద్రతలను ఆశించలేమన్న పవన్ 
  • పోలీసులే స్వతంత్రంగా వ్యవహరించాలని హితవు
కాకినాడలో ఎస్సీ యువకుడు సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసుల వైఖరి, తానే హత్య చేశానని వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ అంగీకరించిన తర్వాత అధికారులు అతడికి అత్యంత గౌరవ మర్యాదలు కనబరిచిన తీరు విస్మయం కలిగిస్తోందని జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సామాన్యుల పట్ల కూడా ఇంత సహృదయత కనబరుస్తారా? అని ప్రశ్నించారు. నేరస్థులకు వత్తాసు పలికేలా అధికార యంత్రాంగాన్ని పాలకులు వినియోగించుకుంటుంటే ఇక శాంతిభద్రతల గురించి ఆలోచన కూడా చేయలేమని పేర్కొన్నారు. 

"కోడి కత్తి కేసులో ఏపీ పోలీసులపై నమ్మకం లేదు అన్నవారే ఇప్పుడు పోలీసు శాఖకు దిశానిర్దేశం చేస్తున్నారు. కోడి కత్తి కేసు పురోగతి ఏమిటో తెలియదు. పులివెందులలో వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం గుండెపోటు నుంచి గొడ్డలిపోటు వరకు వెళ్లింది. ఇప్పటివరకు దోషులు ఎవరో తేలలేదు. 

సామర్లకోట మున్సిపల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీచేసిన గిరీశ్ బాబు అనే ఎస్సీ యువకుడిపై అధికార పార్టీ పోలీసుల సాయంతో వేధింపులకు పాల్పడింది. దాంతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి పోలీసు అధికారి కాలర్ పట్టుకుని దుర్భాషలాడినా పోలీసులు మౌనం వహించాల్సి వచ్చింది. ఇలాంటివే ఇంకా చాలా ఉన్నాయి. 

ఈ రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలకు పాల్పడినా, దాడులు చేసినా ఏం జరగదు అనే ధైర్యం నేరస్థులకు కలగడానికి కారణం పాలకుల వైఖరే. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణను వైసీపీ పాలకుల నుంచి ఎంతమాత్రం ఆశించలేం. వారికే చిత్తశుద్ధి ఉంటే... హత్య చేశానని ఒప్పుకున్న ఎమ్మెల్సీని ఈ పాటికే పార్టీ నుంచి, పెద్దల సభ నుంచి పంపించివేసేలా చర్యలు తీసుకుని ఉండేవారు. కాబట్టి పోలీసు అధికారులే బాధ్యత తీసుకుని రాజకీయ బాసుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా శాంతిభద్రతల పరిరక్షణలో స్వతంత్రంగా వ్యవహరించాలి. అప్పుడే ప్రజలకు పోలీసు వ్యవస్థపై, చట్టాలపై విశ్వాసం కలుగుతుందని" అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.


More Telugu News