పక్కా ప్లాన్ తోనే జగన్ లండన్ కు వెళ్లారు: రఘురామకృష్ణరాజు

  • జగన్ లండన్ కు వెళ్లడంపై వైసీపీ నేతలు పిట్టకథలు చెపుతున్నారన్నా రఘురాజు 
  • దావోస్ కు వెళ్లి జగన్ సాధించేది ఏమీ లేదని కామెంట్ 
  • ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడంలో తప్పు లేదని వివరణ 
దావోస్ పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ తొలుత లండన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. దీని గురించి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ, పక్కా ప్లాన్ తోనే జగన్ లండన్ కు వెళ్లారని అన్నారు. జనాలు పిచ్చోళ్లు అనుకుని వైసీపీ నేతలు ఏవేవో పిట్ట కథలు చెపుతున్నారని విమర్శించారు. దావోస్ కు వెళ్లి జగన్ రాష్ట్రానికి సాధించేది ఏమీ లేదని అన్నారు. ఏపీలో ఆరోగ్యరంగం గురించి దావోస్ లో జగన్ అన్నీ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. 

తనపై వేసిన అనర్హత పిటిషన్ గురించి ప్రివిలేజ్ కమిటీ ముందు వైసీపీ ఎంపీ మార్గాని భరత్ చెప్పిన దాంట్లో పస లేదని అన్నారు. జగన్ ను తాను ఎప్పుడూ తిట్టలేదని, వైసీపీకి వ్యతిరేకంగా కూడా తాను ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించడంలో తప్పులేదని అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా జగన్ ఇచ్చిన వాగ్దానాలను ముఖ్యమంత్రిగా ఉల్లంఘిస్తున్నారని చెప్పారు. అందుకే జగన్ చేసిన తప్పులను ఎత్తి చూపాల్సి వస్తుందని అన్నారు. 

వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు అనర్హులు కాదా? అని ప్రశ్నించారు. హత్య కేసులో ఇరుక్కున్న ఎమ్మెల్సీ అనంతబాబును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. చంపిన తర్వాత మృతుడిని అనంతబాబు కొట్టినట్టు పోలీసులు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. అనంతబాబు ప్రాణాలకు ముప్పు ఉందని రఘురామకృష్ణరాజు చెప్పారు.


More Telugu News