రెండు నెలల క్రితం పుతిన్ హత్యాయత్నం నుంచి తప్పించుకున్నారు: ఉక్రెయిన్ ఇంటెలిజన్స్ చీఫ్

  • పుతిన్ కు తీవ్ర అనారోగ్యం అంటూ కథనాలు
  • పుతిన్ కు అనేక జబ్బులు ఉన్నాయన్న కిరిలో బుదనోవ్
  • వాటిలో క్యాన్సర్ కూడా ఉందని వెల్లడి
  • పుతిన్ ఇప్పట్లో చచ్చే రకం కాదని వ్యాఖ్యలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని గత కొన్నివారాలుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ చీఫ్ కిరిలో బుదనోవ్ ఆసక్తికర అంశాలు వెల్లడించారు. 

పుతిన్ అనేక తీవ్ర జబ్బులతో బాధపడుతున్నారని, వాటిలో క్యాన్సర్ కూడా ఉందని బుదనోవ్ తెలిపారు. అంతేకాదు, రెండు నెలల కిందట జరిగిన ఓ హత్యాయత్నం నుంచి కూడా పుతిన్ తప్పించుకున్నారని స్పష్టం చేశారు. ఆ విఫలయత్నం చేసింది కాకసస్ ప్రాంతానికి చెందిన వాళ్లని తెలిపాడు.

అయితే ఇన్ని జబ్బులతో బాధపడుతున్నా, పుతిన్ రేపే పోతాడని మనం ఆశించడానికి లేదని, వాస్తవానికి అతడికి ఇంకా ఈ భూమ్మీద నూకలు మిగిలే ఉన్నాయని బుదనోవ్ అన్నారు. కాగా, ఉక్రెయిన్ ను మూడు రోజుల్లో కబళించి వేయగలనని పుతిన్ భావించారని, కీవ్ లోని ఉక్రెయిన్ అధికార భవనంపై రష్యా జెండా ఎగురుతుందని అనుకున్నారని... కానీ ఇవేవీ నెరవేరకపోయేసరికి పుతిన్ మానసికంగా గందరగోళ స్థితిలో పడిపోయాడని బుదనోవ్ పేర్కొన్నారు. 

ప్రపంచంలోనే అత్యంత భారీ సైనిక బలం కలిగిన దేశాల్లో ముందు వరుసలో ఉన్న రష్యా మూడ్నెల్లు గడుస్తున్నా ఉక్రెయిన్ ను చేజిక్కించుకోలేకపోయిన నేపథ్యంలో పుతిన్ కు మాటలు కరవయ్యాయని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అయోమయం చెందక ఇంకెలా ఉంటారు? అంటూ బుదనోవ్ ప్రశ్నించారు. 

20, 21వ శతాబ్దంలో నియంత అనే వాడెవడైనా దారుణంగా చచ్చినవాళ్లేనని ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ స్పష్టం చేశారు. ఇటీవలి ఉదాహరణలే తీసుకుంటే సద్దామ్ హుస్సేన్, మాజీ యుగోస్లావియా నియంత, లిబియా నియంత... . ఇలాంటి వాళ్లందరికీ ముగింపు ఒకే తరహాలో ఉంటుందని అన్నారు. పుతిన్ కూడా అందుకు మినహాయింపు కాదని బుదనోవ్ అభిప్రాయపడ్డారు.


More Telugu News