శ్రీ‌లంక‌లో లీట‌రు పెట్రోలు రూ.420కి చేరిన వైనం

  • లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 24.3 శాతం మేర పెంపు
  • డీజిల్ ధర 38.4 శాతం పెరుగుద‌ల‌
  • ర‌వాణా ఛార్జీల‌పై తీవ్ర‌ భారం
తీవ్ర ఆర్థిక‌, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న‌ శ్రీలంకలో పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు మ‌రింత పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 24.3 శాతం పెరగగా, డీజిల్ ధర 38.4 శాతం పెరిగింది. లీటర్ పెట్రోల్ ధ‌ర‌ రూ.82 పెరిగి, రూ.420కి చేరింది. అలాగే, లీట‌రు డీజిల్ ధ‌ర‌ రూ.111 పెరిగి, రూ.400కు చేరింది. ఈ మేర‌కు సిలోన్‌ పెట్రోలియం కార్పొరేషన్ నేటి నుంచే ఈ ధ‌ర‌లు పెంచింది. 

మ‌రోవైపు, ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అనుబంధ సంస్థ లంకా ఐఓసీ కూడా చమురు ధరలను పెంచింది. ర‌వాణా ఛార్జీల‌పై భారం మ‌రింత ప‌డుతుండ‌డంతో అన్ని ర‌కాల వ‌స్తువులు, స‌రుకుల ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. 

ఆటో డ్రైవ‌ర్లు ఇప్ప‌టికే కిలో మీటరుకు ప్రయాణికుడి వద్ద దాదాపు రూ.90 తీసుకుంటున్నారు. శ్రీ‌లంక‌లో ప్ర‌జ‌లు పెట్రోల్‌, డీజిల్, వంటగ్యాస్ తో పాటు ఇతర నిత్యావసరాల కోసం భారీగా క్యూ క‌ట్టాల్సి వ‌స్తోంది. మ‌రోవైపు శ్రీ‌లంక‌లో విద్యుత్‌ కోతలు, ఆహార పదార్థాల కొరత ప్రజ‌ల‌ను వేధిస్తున్నాయి.


More Telugu News