ప్రపంచ అత్యంత ప్రభావశీలుర జాబితాలో గౌతమ్ అదానీ, సుప్రీంకోర్టు న్యాయవాది కరుణా నంది

  • టాప్-100 జాబితా వెలువరించిన టైమ్ మ్యాగజైన్
  • 6 కేటగిరీలుగా జాబితా
  • టైటాన్స్ కేటగిరీలో అదానీ
  • లీడర్స్ కేటగిరీలో కరుణా నంది
ప్రపంచ అత్యంత ప్రభావశీలుర జాబితాను ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. భారత కుబేరుడు గౌతమ్ అదానీ, సుప్రీంకోర్టు న్యాయవాది కరుణా నంది, కశ్మీర్ మానవ హక్కుల కార్యకర్త ఖుర్రమ్ పర్వేజ్ టైమ్ మ్యాగజైన్ టాప్-100లో చోటు దక్కించుకున్నారు. కాగా, ప్రపంచ అత్యంత ప్రభావశీలుర జాబితాను టైమ్ మ్యాగజైన్ 6 కేటగిరీలుగా విభజించింది. టైటాన్స్, ఐకాన్స్, ఆర్టిస్ట్స్, లీడర్స్, పయనీర్స్, ఇన్నోవేటర్స్ పేరిట కేటగిరీలను రూపొందించింది.

గౌతమ్ అదానీ టైటాన్స్ కేటగిరీలో ఈ జాబితాలో స్థానం సంపాదించారు. ఇదే విభాగంలో ఆపిల్ సీఈవో టిమ్ కుక్, అమెరికాకు చెందిన ప్రఖ్యాత బుల్లితెర హోస్ట్ ఓప్రా విన్ ఫ్రే కూడా ఉన్నారు. ఇక, సుప్రీంకోర్టు మహిళా న్యాయవాది కరుణా నంది, హక్కుల కార్యకర్త ఖుర్రమ్ పర్వేజ్ లీడర్స్ కేటగిరీలో స్థానం సంపాదించారు. ఇదే కేటగిరీలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ, చైనా దేశాధినేత జిన్ పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఉన్నారు. 

కాగా, గౌతమ్ అదానీ సారథ్యంలోని అదానీ గ్రూప్ ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా ఉందని టైమ్ మ్యాగజైన్ తెలిపింది. ఇక, కరుణా నందిపై టైమ్ మ్యాగజైన్ ప్రశంసలు కురిపించింది. ఆమె కేవలం న్యాయవాది మాత్రమే కాదని, ప్రజా ఉద్యమకారిణి అని పేర్కొంది. కోర్టులోనే కాకుండా సమాజంలోనూ మార్పు కోసం ఎలుగెత్తిన ధైర్యశాలి, సమర్థురాలు కరుణా నంది అని వివరించింది.


More Telugu News