రాజ్య‌స‌భ స‌భ్యుడిగా వ‌ద్దిరాజు ఏకగ్రీవ ఎన్నిక‌

  • బండ ప్ర‌కాశ్ రాజీనామాతో ఉప ఎన్నిక‌
  • టీఆర్ఎస్ నుంచి గాయ‌త్రి ర‌వి నామినేష‌న్‌
  • ఇత‌ర పార్టీల నుంచి దాఖ‌లు కాని నామినేష‌న్లు
  • గాయ‌త్రి ర‌వి ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు ప్ర‌కట‌న‌
తెలంగాణ కోటాలో ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు జరిగిన ఉప ఎన్నిక‌లో అధికార టీఆర్ఎస్ ప్ర‌తిపాదించిన‌ వద్దిరాజు ర‌విచంద్ర (గాయ‌త్రి ర‌వి) ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు ఉప ఎన్నిక రిట‌ర్నింగ్ అధికారి అయిన అసెంబ్లీ కార్య‌ద‌ర్శి నుంచి ఆయన ఎన్నిక ప‌త్రాన్ని అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా రాజ్య‌సభ‌కు ఏక‌గ్రీవంగా ఎన్నికైన గాయ‌త్రి ర‌విని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి అభినందించారు.

తెలంగాణ కోటా నుంచి రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగిన బండ ప్ర‌కాశ్... ఇటీవ‌లే తెలంగాణ శాస‌న మండ‌లి సభ్యుడి (ఎమ్మెల్సీ)గా ఎన్నికైన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో బండ ప్ర‌కాశ్ త‌న రాజ్య‌స‌భ స‌భ్వత్వానికి రాజీనామా చేయ‌గా... ఇంకా రెండేళ్ల ప‌ద‌వీ కాలం ఉన్న ఆ స్థానానికి తాజాగా ఉప ఎన్నిక నిర్వ‌హించారు. 

ఈ ఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా గాయ‌త్రి ర‌వి నామినేష‌న్ దాఖలు చేశారు. అసెంబ్లీలో బ‌లం ఆధారంగా ఇత‌ర పార్టీలు నామినేష‌న్లు వేసినా ఈ స్థానం నుంచి గాయ‌త్రి ర‌వి ఎన్నిక కావ‌డం ఖాయం. ఇదే విషయాన్ని గ‌మనించిన ఇత‌ర పార్టీలు త‌మ అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింప‌లేదు. దీంతో ఈ స్థానానికి గాయ‌త్రి ర‌వి ఒక్క‌రి నుంచే నామినేష‌న్ అంద‌డంతో ఆయ‌న ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు రిట‌ర్నింగ్ అధికారి ప్ర‌క‌టించారు.


More Telugu News