వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు అరెస్ట్.. కాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టనున్న పోలీసులు!

  • డ్రైవర్ సుబ్రహ్మణ్యంను తాను హత్య చేసినట్టు ఒప్పుకున్న ఎమ్మెల్సీ అనంత భాస్కర్
  • తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నాడని వెల్లడి
  • కొట్టి బెదిరిద్దామనుకున్నానని.. కానీ చనిపోయాడని చెప్పిన ఎమ్మెల్సీ
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత పోలీసులు దీన్ని హత్య కేసుగా మార్చారు. కేసును విచారించిన పోలీసులు ఎమ్మెల్సీ అనంత భాస్కర్ ను అరెస్ట్ చేశారు. రహస్య ప్రదేశంలో ఆయనను విచారించారు. ప్రస్తుతం అనంత భాస్కర్ పోలీసుల కస్టడీలో ఉన్నట్టు కాకినాడ ఏఎస్పీ వెల్లడించారు. 

మరోవైపు, ఈ విచారణలో సుబ్రహ్మణ్యంను తానే హత్య చేసినట్టు ఎమ్మెల్సీ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నందుకే హత్య చేసినట్టు ఆయన తెలిపినట్టు సమాచారం. తనను బ్లాక్ మెయిల్ చేయడంతో, బెదిరిద్దామని అనుకున్నానని... కొట్టి బెదిరిద్దాం అని భావించానని చెప్పారు. అయితే తాను ఆవేశంతో కొడితే చనిపోయాడని తెలిపారు.

 మరోవైపు కాసేపట్లో ఆయనను జడ్జి జానకి ఎదుట హాజరు పరచనున్నారు. కోర్టు సమయం ముగియడంతో జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. జడ్జి ఆయనకు రిమాండ్ విధించే అవశాశం ఉంది. ప్రస్తుతం ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఎమ్మెల్సీని ఆసుపత్రికి తరలిస్తున్నట్టు సమాచారం.


More Telugu News