తెలంగాణకు చెందిన ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపడంపై బొత్స సత్యనారాయణ స్పందన

  • ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపితే తప్పేముందన్న బొత్స 
  • ఆయన ఎక్కడి వారు అని కాకుండా.. ఎంత సమర్థుడు అనేది చూడాలని హితవు 
  • ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని వ్యాఖ్య 
బీసీ నేతలతో త్వరలోనే బస్సు యాత్రను చేపడతామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తెలంగాణకు చెందిన బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపితే తప్పేముందని ప్రశ్నించారు. బీసీల సమస్యలను కృష్ణయ్య సమర్థవంతంగా పార్లమెంటులో వినిపిస్తారని చెప్పారు. ఒక వ్యక్తి ఎక్కడివాడు అని చూడకూడదని... ఆయన ఎంత సమర్థుడు అనే విషయాన్ని చూడాలని అన్నారు. 

ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ హత్య విషయంలో చట్టం తన పనిని తాను చేసుకుంటూ పోతుందని బొత్స చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే 302 కేసు నమోదు చేశారని తెలిపారు. కేసును భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని... చట్టం ముందు ఎవరైనా ఒకటేనని చెప్పారు. ఎమ్మెల్సీపై సస్పెన్షన్ వ్యవహారాన్ని పార్టీ హైకమాండ్ చూసుకుంటుందని అన్నారు.


More Telugu News