శ్రీలంకలో ఔషధాల కొరత.. మరణాలు తప్పవంటున్న వైద్యులు!
- ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక
- 180 రకాల ఔషధ కొరతతో సతమతమవుతున్న శ్రీలంక
- విదేశీ కరెన్సీ నిల్వలు తగ్గిపోవడంతో దిగుమతి చేసుకోలేని పరిస్థితి
ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను మరో కీలక అంశం కలవరపెడుతోంది. ఇప్పటికే ఆ దేశంలో ఔషధాల కొరత నెలకొంది. ఈ నేపథ్యంలో అత్యవసర ఆపరేషన్లను సైతం వాయిదా వేయాల్సి వచ్చింది. దేశంలో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మందులు లేక రోగుల ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తోందని... తక్షణమే ఔషధ సరఫరాను పెంచకపోతే రోగులు పెద్ద సంఖ్యలో మరణించడం తప్పదని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు శ్రీలంకలో విదేశీ కరెన్సీ రిజర్వులు కూడా తగ్గిపోవడంతో... ఔషధాలను దిగుమతి చేసుకునే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దాదాపు 180 రకాల ఔషధాల కొరత ఉందని ఔషధాల సరఫరా విభాగంలో పని చేస్తున్న ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యాధికారుల సంఘం అధికార ప్రతినిధి డాక్టర్ వాసన్ రత్నసింగం మాట్లాడుతూ... పెట్రోల్, వంట గ్యాస్ కోసం క్యూలైన్లలో నిల్చున్నట్టు ఔషధాల కోసం నిల్చునే పరిస్థితి ఉండదని చెప్పారు. చికిత్స ఆలస్యమైతే ప్రాణాలు పోతాయని అన్నారు.