ఆశా కార్యకర్తల సేవలను కీర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

  • ప్రజలకు ఆరోగ్య సేవలను చేరువ చేస్తున్నారని ప్రకటన
  • కరోనా సమయంలో అసమాన సేవలు అందించారని ప్రశంస
  • గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డుతో గుర్తింపు
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య సదుపాయాలను చేరువ చేయడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నారంటూ 10 లక్షల మంది ఆశా కార్యకర్తల సేవలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుతించింది. భారత్ లో కరోనా వైరస్ నియంత్రణకు వారు అలుపెరుగని సేవలు అందించారని కొనియాడింది.

ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సేవలను విస్తృతం చేయడంలో అసాధారణ సేవలు అందించినందుకు గుర్తింపుగా ‘గ్లోబల్ హెల్త్ లీడర్స్’ విభాగంలో ఆరు అవార్డులను డబ్ల్యూహెచ్ వో డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రెస్ అధనామ్ గెబ్రేయెసెస్ ఆదివారం ప్రకటించారు. అందులో భారత్ కు చెందిన ఆశా కార్యకర్తులు కూడా ఉన్నారు. 

‘‘ఆశా అంటే హిందీలో ఆశ. భారత్ లో మిలియన్ కు పైగా మహిళా వలంటీర్లు ఆరోగ్య వ్యవస్థతో కమ్యూనిటీని అనుసంధానించడంలోను.. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు ఆరోగ్య సేవలు పొందడంలోనూ వీరి సేవలు అమోఘం. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో వారు చేసిన సేవలను గుర్తిస్తున్నాం’’ అని ప్రకటించారు. 

మన దేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆశా కార్యకర్తలు నిజంగా ఆశాదీపం అని చెప్పుకోవాలి. చాలా తక్కువ గౌరవ వేతనానికే వారు అందిస్తున్న సేవలు అసమానమైనవి. గర్భిణులకు మేటర్నిటీ సేవలు అందించడం, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం, టీబీ, రక్తపోటు మందుల పంపిణీ, శానిటేషన్, పోషకాహారంపై అవగాహన కల్పించడం, ఇంటింటి ఆరోగ్య సర్వే ఇలా ఎన్నో సేవలు వారు అందిస్తుంటారు.


More Telugu News