ప్లాస్టిక్ స్ట్రాలపై నిషేధం.. రూ.10 ఫ్రూటీ పరిస్థితి ఏమిటి?

  • జులై 1 నుంచి ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్ పై నిషేధం అమల్లోకి
  • జ్యూస్ ప్యాక్ లతో పేపర్ స్ట్రాలు ఇచ్చుకోవచ్చు
  • కానీ వాటి కోసం దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి
  • వ్యయాలు  పెరిగిపోతాయని కంపెనీల ఆందోళన
ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం జులై 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం రూ.10, రూ.20కు విక్రయించే ఫ్రూటీ, మజా తదితర ఎన్నో పండ్ల రసాలు, మిల్క్ షేక్ ఉత్పత్తులకు చిక్కులను తెచ్చి పెట్టనుంది. ఎందుకంటే ఆయా టెట్రాప్యాక్ లకు అనుబంధంగా ప్లాస్టిక్ స్ట్రాను కంపెనీలు అందిస్తున్నాయి. కొత్త నిబంధనల కింద ప్లాస్టిక్ స్ట్రా ఇవ్వడం కుదరదు. 

కంపెనీలు తమ ఉత్పత్తుల పై భాగంలో సీల్ ను చింపేసి తాగేలా ఏర్పాటు చేయడం లేదంటే.. క్యాప్ మాదిరి ఏర్పాటు చేసుకోవడమే పరిష్కారం. కానీ, ఇలా ఏది చేసినా కంపెనీలు అదనపు ఖర్చు మోయాల్సి వస్తుంది. పరిశ్రమకు ఇప్పుడు ఇదే ఆందోళన పట్టుకుంది. పేపర్ స్ట్రాలను అందించొచ్చు. కానీ ప్లాస్టిక్ స్ట్రా అయితే చాలా చౌకగా వస్తోంది. దీని స్థానంలో పేపర్ స్ట్రా ఇవ్వాలంటే కంపెనీలు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఉత్పత్తుల రేట్లను పెంచాల్సి రావచ్చు.

మన దేశంలో పేపర్ స్ట్రాల తయారీ పెద్దగా లేదు. ప్లాస్టిక్ స్ట్రాలపై నిషేధం అమల్లోకి వస్తే కంపెనీలు పేపర్ స్ట్రాల కోసం ఇండోనేషియా, చైనా, మలేషియా, ఫిన్లాండ్ పై ఆధారపడాల్సి వస్తుంది. ఇది అదనపు వ్యయానికి దారితీస్తుందని కంపెనీలు అంటున్నాయి. ఇది ప్రభుత్వానికి ఆదాయ నష్టానికి కూడా దారితీస్తుందని డాబర్ ఇండియా సీఈవో మల్హోత్రా అన్నారు. 

నిర్ణయాన్ని కనీసం ఆరు నెలలు వాయిదా వేయాలని ఫ్రూటీని తయారు చేసే పార్లే ఆగ్రో కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. స్థానికంగా పేపర్ స్ట్రాల తయారీ పట్టాలెక్కడానికి ఈ వ్యవధి ఉపయోగపడుతుందని సూచించింది. రూ.10 జ్యూస్ ప్యాక్ లపై తమకు చాలా స్వల్ప మార్జిన్ ఉంటుందని కంపెనీలు చెబుతున్నాయి. మామూలుగా మన దేశంలో ఏటా స్ట్రాలు జోడించిన 600 కోట్ల జ్యూస్ ప్యాక్ లు అమ్ముడుపోతుంటాయి. ప్రభుత్వ నిర్ణయంతో పెరిగిన వ్యయభారాన్ని కస్టమర్లకు బదిలీ చేయడం మినహా కంపెనీలకు మరో మార్గం లేదని తెలుస్తోంది.


More Telugu News