తెల్లవారిన బతుకులు.. తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజామున నెత్తురోడిన రోడ్లు.. 13 మంది బలి

  • వరంగల్ హంటర్ రోడ్ లో మరో కారును ఢీకొట్టి ఫ్లై ఓవర్ పై నుంచి పడిన కారు
  • దంపతుల మృతి.. మరో కారులోని ఇద్దరికి గాయాలు
  • ఖిలావరంగల్ లో ఆటోను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం
  • మూడు గంటలు రోడ్డుపైనే మృతదేహాలు
  • వైఎస్సార్ జిల్లాలో లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురి మృతి
  • అన్నమయ్య జిల్లాలో రెండు బైకులు ఢీకొని ఇద్దరు బలి
తెలుగు రాష్ట్రాలు ఈ ఉదయం నెత్తురోడాయి. నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. తెల్లవారుజామున జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది మరణించారు. ఆ వివరాలు.. 

వరంగల్ లోని హంటర్ రోడ్ ఫ్లై ఓవర్ పై ఓ కారును ఢీకొట్టిన మరో కారు.. ఫ్లై ఓవర్ పై నుంచి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఫ్లై ఓవర్ పై నుంచి పడిన కారులోని భార్యాభర్తలు మరణించారు. భర్త స్పాట్ లోనే చనిపోగా.. అతడి భార్య ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. వారిని ప్రభుత్వ ఉద్యోగి సారయ్య (42), సుజాత (39)గా గుర్తించారు. మరో కారులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న ఆ ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 

ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వద్ద తెల్లవారుజామున ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, డ్రైవర్ సంఘటన స్థలంలోనే చనిపోయారు. డ్రైవర్ ను తిమ్మాపూర్ కు చెందిన బబ్లూగా గుర్తించారు. పోలీసులకుగానీ, అంబులెన్సుకుగానీ ప్రమాద సమాచారం అందకపోవడంతో మృతదేహాలు దాదాపు మూడుగంటల పాటు రోడ్డుపైనే పడి ఉన్నాయి. తెల్లవారుతుండగా పలువురు చూసి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు మృతదేహాలను వరంగల్ ఎంజీఎంకు తరలించారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి వద్ద బైకును వెనుకనుంచి వచ్చిన బొగ్గులారీ ఢీకొట్టడంతో ఈసం హనుమంతు (34), ఈసం స్వామి (42) అనే ఇద్దరు దుర్మరణం చెందారు. వాళ్లిద్దరూ ఓ పెళ్లిలో బాజాలు మోగించి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హనుమంతు ప్రమాద స్థలంలోనే మరణించగా.. స్వామిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. 

మేడ్చల్ జిల్లా సూరారంలో కోళ్లను తీసుకెళుతున్న డీసీఎం వాహనం.. సూరారం కాలనీ నుంచి రోడ్డుపైకి వస్తున్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో డీసీఎంలోని క్లీనర్ మరణించాడు. దుండిగల్ పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. 

ఏపీలో..

వైఎస్సార్ జిల్లాలో ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతిచెందారు. జిల్లాలోని మైలవరం మండలం తాడిపత్రి బైపాస్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్, చిన్నారిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం గుట్టపల్లి వద్ద రెండు బైకులు ఢీకొని ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారిని కలకడ మండలానికి చెందిన సోమశేఖర్ (18), జ్యోతి నాయుడు (19)గా గుర్తించారు. గుట్టపల్లి ఆంజనేయ స్వామి జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.


More Telugu News