మోదీ ఎక్సైజ్ త‌గ్గించారు.. కేసీఆర్ వ్యాట్ త‌గ్గించాలి: బండి సంజ‌య్‌

  • పెట్రోల్‌, డీజిల్‌ల‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం
  • కేంద్రం నిర్ణ‌యాన్ని స్వాగ‌తించిన బండి సంజ‌య్‌
  • కేసీఆర్ స‌ర్కారు కూడా వ్యాట్ త‌గ్గించాల‌ని డిమాండ్‌
  • లేదంటే ప్ర‌జాగ్ర‌హం చ‌విచూడాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రిక‌
ఇప్ప‌టికే ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌ల‌పై వ్యాట్‌ను త‌గ్గించాలంటూ బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహారావు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి విజ్ఞ‌ప్తి చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా తెలంగాణలోని టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి కూడా అదే త‌ర‌హా డిమాండ్ వచ్చింది. ఈ మేర‌కు బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు ఈ దిశ‌గా విజ్ఞ‌ప్తి చేశారు. 

పెట్రోల్, డీజిల్ పై కేంద్రం భారీగా ఎక్సైజ్ సుంకం తగ్గించినందుకు ప్రధాని  న‌రేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన బండి సంజ‌య్‌.. మోదీ సర్కారు బాట‌లోనే కేసీఆర్ స‌ర్కారు కూడా తెలంగాణ‌లో పెట్రోల్, డీజిల్‌పై విధిస్తున్న వ్యాట్‌ను త‌గ్గించాల‌ని డిమాండ్ చేశారు. పెట్రోల్‌, డీజిల్‌పై గ‌తంలోనూ కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింద‌ని ఆయ‌న తెలిపారు. 

ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ ప్ర‌జా శ్రేయ‌స్సే ల‌క్ష్యంగా సాగుతున్న బీజేపీ ప్ర‌భుత్వం ల‌క్ష కోట్ల రూపాయ‌ల మేర ఆదాయం త‌గ్గుతుంద‌ని తెలిసినా ఎక్సైజ్ సుంకాన్ని త‌గ్గించింద‌న్నారు. కేంద్రం మాదిరే రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా వ్యాట్‌ను త‌గ్గించి ప్ర‌జ‌ల‌కు మ‌రంత ఉప‌శ‌మ‌నం క‌ల్పించేలా నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. లేని ప‌క్షంలో కేసీఆర్ స‌ర్కారు ప్ర‌జాగ్ర‌హాన్ని చ‌విచూడాల్సి వ‌స్తుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.


More Telugu News