పాక్ హనీ ట్రాప్ లో చిక్కుకుని కీలక సమాచారం లీక్ చేసిన జవాను అరెస్ట్

  • జోథ్ పూర్ లో గన్నర్ గా పనిచేస్తున్న ప్రదీప్ కుమార్
  • ఆర్నెల్ల కిందట మహిళతో పరిచయం
  • పెళ్లి పేరిట జవానుకు వల విసిరిన మహిళ
  • నిజమని నమ్మి కీలక సమాచారం ఇచ్చిన జవాను
  • పాక్ నిఘా సంస్థ కుతంత్రం
భారత సైనిక రహస్యాలు తెలుసుకునేందుకు పాకిస్థాన్ నిఘా వర్గాలు ఎప్పటినుంచో హనీ ట్రాప్ లు విసురుతుండడం తెలిసిందే. అందమైన అమ్మాయిలను ఎరవేసి భారత జవాన్లను ఉచ్చులోకి లాగి, వారి నుంచి కీలక సమాచారం సేకరించాలన్నది పాక్ పన్నాగం. తాజాగా  ప్రదీప్ కుమార్ అనే జవాను కూడా పాక్ హనీ ట్రాప్ లో చిక్కుకున్నాడు. 

ప్రదీప్ కుమార్ రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో గన్నర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పాకిస్థానీ నిఘా ఏజెన్సీకి చెందిన ఓ మహిళతో అతడు ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా సన్నిహితంగా ఉన్న విషయాన్ని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. దాంతో కొన్ని రోజులుగా ప్రదీప్ కుమార్ పై నిఘా వేశాయి. అతడు సైన్యానికి సంబంధించిన కీలక, వ్యూహాత్మక సమాచారాన్ని పాక్ మహిళకు అందించినట్టు గుర్తించాయి. ఈ నేపథ్యంలో, ప్రదీప్ కుమార్ ను అరెస్ట్ చేసినట్టు భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. 

అతడిని ఈ నెల 18వ తేదీన అదుపులోకి తీసుకుని, ప్రాథమిక విచారణ అనంతరం అరెస్ట్ చేసినట్టు వివరించారు. ప్రదీప్ కుమార్ కు ఆర్నెల్ల కిందట సదరు మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. ఆమె తనను తాను మిలిటరీ నర్సింగ్ వర్కర్ గా పరిచయం చేసుకుందని, తాను బెంగళూరులో పనిచేస్తున్నట్టు అతడిని నమ్మించిందని పేర్కొన్నారు. ఢిల్లీలో కలుసుకుందామని, పెళ్లి చేసుకుందామని అతడిని ఉచ్చులోకి లాగిందని ఆ అధికారి వివరించారు. తన మాయలో పడిపోయాడని నిర్ణయించుకున్నాక, ఆమె అతడి నుంచి కీలక సమాచారం రాబట్టిందని వెల్లడించారు.


More Telugu News