మంచిర్యాల జిల్లాలో రూలింగ్ పార్టీ నాయ‌కులు రైతుల‌ మెడకు ఉరితాడు చుడుతున్నరు: విజ‌య‌శాంతి

  • రైతు ప్ర‌భుత్వ‌మ‌ని కేసీఆర్ స‌ర్కార్ చెప్పుకుంటోందన్న విజ‌య‌శాంతి
  • చేతల్లో మాత్రం అందుకు విరుద్ధంగా ఉందని వ్యాఖ్య‌
  • నకిలీ విత్తనాలతో రైతులను ముంచుతున్నరని విమ‌ర్శ‌
  • ఇప్పటికే క్వింటాళ్ల కొద్దీ విత్తనాలను గ్రామాలకు తరలించార‌ని ఆరోప‌ణ‌
తెలంగాణ ప్ర‌భుత్వంపై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. అన్న‌దాత‌ల స‌మ‌స్య‌ల గురించి ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ఆమె అన్నారు. 

''రైతు ప్ర‌భుత్వ‌మ‌ని చెప్పుకునే కేసీఆర్ స‌ర్కార్... చేతల్లో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. మంచిర్యాల జిల్లాలో రూలింగ్ పార్టీ నాయ‌కులు రైతుల‌ మెడకు ఉరితాడు చుడుతున్నరు. కొంతమంది అధికార‌ పార్టీ లీడర్లు, వారి బంధువులు, అనుచరులు నకిలీ విత్తనాలతో రైతులను ముంచుతున్నరు. ఇప్పటికే క్వింటాళ్ల కొద్దీ విత్తనాలను గ్రామాలకు తరలించి రైతులకు అంటగట్టారు. జిల్లాలో భీమిని, నెన్నెల మండలాల్లో నకిలీ పత్తి విత్తనాల దందా జోరుగా నడుస్తోంది. 

సీజన్ ప్రారంభానికి రెండు-మూడు నెలల ముందే ఏపీలోని కర్నూలు, నంధ్యాల, గుంటూరు ప్రాంతాల నుంచి భారీ మొత్తంలో నకిలీ సీడ్ భీమినికి చేరింది. నెన్నెల మండలంలో కూడా అధికార పార్టీ లీడర్ల కనుసన్నల్లో నకిలీ విత్తన దందా కొనసాగుతోంది. 

ఆంధ్రాకి చెందిన ఓ ముఠా మందమర్రి కేంద్రంగా బెల్లంపల్లి, చెన్నూర్ నియోజక వర్గాల్లో నకిలీ దందా సాగిస్తోంది. కౌలు రైతుల ముసుగులో ఇక్కడికి వచ్చిన కొందరు... వ్యవసాయాన్ని వదిలి నకిలీ సీడ్ బిజినెస్లో ఆరితేరారు. ఈ విషయం ఆఫీసర్లకు తెలిసినా చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నరు.

కొన్ని రోజులుగా ఫెర్టిలైజర్స్ షాపుల్లో నామమాత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ హడావుడి చేస్తున్నరు. అడపాదడపా కేసులు పెట్టినా.. అధికార పార్టీ లీడర్ల వైపు మాత్రం కన్నెత్తి చూడడం లేదు. రైతుల‌ను నిండా ముంచుతున్న టీఆర్ఎస్ పార్టీకి ఈ రైత‌న్న‌లు త‌గిన బుద్ధి చెప్పడం ఖాయం'' అని విజ‌య‌శాంతి ట్విట్ట‌ర్‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు.


More Telugu News