ఓటమితో ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన చెన్నై.. టాప్-2లోకి రాజస్థాన్ రాయల్స్

  • చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నైని 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన రాజస్థాన్
  • సూపర్ ఇన్నింగ్స్‌తో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచిన అశ్విన్
  • ప్లే ఆఫ్స్‌కు వెళ్లే మూడు జట్లు ఖరారు
  • నేటి ముంబై-ఢిల్లీ మ్యాచ్‌తో తేలనున్న బెంగళూరు భవితవ్యం
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం ముగిసింది. ఓటమితో ఈ సీజన్ నుంచి నిష్క్రమించింది. గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నైని ఐదు వికెట్ల తేడాతో ఓడించిన రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో లక్నోను కిందికి లాగేసి రెండో స్థానానికి దూసుకెళ్లింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించిన రాజస్థాన్ ప్రత్యర్థిపై తిరుగులేని విజయాన్ని సాధించింది. తొలుత చెన్నైని 150 పరుగులకే కట్టడి చేసిన శాంసన్ సేన ఆ తర్వాత ఐదు వికెట్లు కోల్పోయి మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 151 పరుగుల విజయ లక్ష్యాన్ని అందుకుంది.  

ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలుత అర్ధ సెంచరీ (59)తో అదరగొట్టగా, చివరి ఓవర్లలో రవిచంద్రన్ అశ్విన్ చెలరేగిపోయాడు. 23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసి జట్టుకు అపురూప విజయాన్ని అందించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. కెప్టెన్ సంజు శాంసన్ 15, రియాన్ పరాగ్ 10 పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ప్రశాంత్ సోలంకికి రెండు వికెట్లు దక్కాయి.

అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఈ సీజన్‌లో తీవ్రంగా నిరాశపరిచిన మొయిన్ అలీ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 57 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 93 పరుగులు చేసి ఏడు పరుగుల తేడాతో శతకం కోల్పోయాడు. అతడి దెబ్బకు తొలుత స్కోరు 200 దాటుతుందని భావించారు. అయితే, ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు బ్యాట్ ఝళిపించడంలో విఫలం కావడంతో పరుగులు నెమ్మదించాయి. 

జగదీశన్ (1), రాయుడు (3) ఇలా వచ్చి అలా వెళ్లడానికి తోడు కెప్టెన్ ధోనీ కూడా పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. 28 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 26 పరుగులు మాత్రమే చేశాడు. ఫలితంగా జట్టు స్కోరు 150 పరుగులకు పరిమితమైంది. రాజస్థాన్ బౌలర్లలో చాహల్, మెక్‌కాయ్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 14 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్‌కు ఇది 9వ విజయం కాగా, చెన్నైకి ఇది పదో పరాజయం. 

ఈ మ్యాచ్‌తో నాకౌట్‌కు చేరుకునే తొలి మూడు జట్లు ఖరారయ్యాయి. గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో ఉండగా, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. నేడు ముంబై ఇండియన్స్-ఢిల్లీ కేపిటల్స్ మధ్య చివరి లీగ్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిస్తే నాలుగో స్థానానికి ఎగబాకి ప్లే ఆఫ్స్‌లో చోటు సంపాదించుకుంటుంది. ఓడితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.


More Telugu News