అమెరికా, యూరప్ దేశాల్లో మంకీ పాక్స్ కలకలం.... డబ్ల్యూహెచ్ఓ అత్యవసర సమావేశం

  • పలు దేశాల్లో పెరుగుతున్న మంకీ పాక్స్ కేసులు
  • బ్రిటన్ లో 20 పాజిటివ్ కేసులు
  • జర్మనీ, ఫ్రాన్స్, బెల్జియంలో నేడు తొలి కేసుల నమోదు
కరోనా మహమ్మారి సృష్టించిన విలయం నుంచి క్రమంగా తేరుకుంటున్న ప్రపంచ దేశాలను మంకీ పాక్స్ రూపంలో మరో ఉపద్రవం కలవరపెడుతోంది. మంకీ పాక్స్ వైరస్ ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో, కొత్త మహమ్మారిపై చర్చించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అత్యవసరంగా సమావేశమైంది. మంకీ పాక్స్ వైరస్ వ్యాపిస్తున్న తీరు, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. 

అనేక దేశాల్లో మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి. బ్రిటన్ లో మే 6 నుంచి 20 కేసులు వెలుగు చూశాయి. ఇవాళ ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం దేశాల్లోనూ తొలి కేసులు నమోదయ్యాయి. మంకీ పాక్స్ జంతువుల నుంచి మానవులకు వ్యాపించే వైరస్. స్మాల్ పాక్స్ తరహాలోనే దీని లక్షణాలు కూడా ఉంటాయి. అయితే మంకీ పాక్స్ లో ఈ లక్షణాలు మరింత తీవ్రంగా ఉండి, ఆసుపత్రి పాలుచేస్తాయి.

ప్రాణాంతకం కాకపోయినా, జ్వరం, కండరాల నొప్పులు, లింఫ్ గ్రంథుల్లో వాపు,ముఖంపైనా, చేతులపైనా దద్దుర్లు, వణుకు, తీవ్ర అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ బారినపడిన వ్యక్తిని తాకినా, నోటి నుంచి వెలువడే తుంపర్లు తగిలినా, వారు ఉపయోగించిన వస్తువులు వాడినా ఇది సోకుతుంది. ఇప్పటివరకు మంకీ పాక్స్ కు నిర్దిష్ట చికిత్స అంటూ లేదు. లక్షణాల ఆధారంగా చికిత్స చేస్తారు.


More Telugu News