తన బౌలింగ్ యాక్షన్ పై సెహ్వాగ్ వ్యాఖ్యలకు బదులిచ్చిన షోయబ్ అక్తర్

  • అక్తర్ బంతిని త్రో చేసేవాడన్న సెహ్వాగ్
  • చకింగ్ కు పాల్పడేవాడని ఆరోపణ
  • సెహ్వాగ్ కు ఐసీసీ కంటే ఎక్కువ తెలుసా? అన్న అక్తర్ 
  • ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని హితవు
పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ బౌలింగ్ యాక్షన్ అప్పుడూ, ఇప్పుడూ వివాదాస్పదమే! ఇటీవల భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్... అక్తర్ బౌలింగ్ యాక్షన్ పై వ్యాఖ్యలు చేశాడు. అక్తర్ చకింగ్ (త్రో) చేసేవాడని ఆరోపించాడు. అక్తర్ బౌలింగ్ లో వరుసగా రెండు బంతులను చితక్కొట్టామంటే, మూడో బంతికి అతడి బౌలింగ్ యాక్షన్ మారిపోయేదని సెహ్వాగ్ పేర్కొన్నాడు. అక్తర్ మోచేయి మరింతగా వంగేదని, తాను చేసేది చకింగ్ అని అతడికి కూడా తెలుసని సెహ్వాగ్ తెలిపాడు.

ఆస్ట్రేలియన్ స్పీడ్ స్టర్ బ్రెట్ లీ బౌలింగ్ ను అర్థం చేసుకోగలిగేవాడ్నని, కానీ అక్తర్ బౌలింగ్ మాత్రం అర్థమయ్యేది కాదని తెలిపాడు. అతడి చేయి ఎలా వంగుతుందో, బంతి ఎక్కడ్నించి రిలీజ్ అవుతుందో తెలిసేది కాదని వివరించాడు. ఈ వ్యాఖ్యలపై అక్తర్ స్పందించాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని సెహ్వాగ్ కట్టిపెట్టాలని హితవు పలికాడు. ఐసీసీ కంటే తనకే ఎక్కువగా తెలుసని సెహ్వాగ్ భావిస్తే, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని అక్తర్ సూచించాడు. 

సెహ్వాగ్ గొప్ప ఆటగాడేనని, జట్టు కోసం తపనపడే ఆటగాడని, కానీ, ఈ వయసులో ఎలా పడితే అలా వ్యాఖ్యలు చేస్తే ఎవరూ హర్షించరని పేర్కొన్నాడు. తానైతే ఎంతో ఆచితూచి మాట్లాడతానని, జాతీయస్థాయి ఆటగాళ్ల పట్ల అవమానకరంగా మాట్లాడబోనని అక్తర్ వెల్లడించాడు. అయితే, సెహ్వాగ్ ఇంటర్వ్యూను తాను చూడలేదని, జోక్ చేశాడో లేక సీరియస్ గానే అన్నాడో తెలియదని వివరించాడు. సెహ్వాగ్ తనకు క్లోజ్ ఫ్రెండ్ అని తెలిపాడు. 

ఏదేమైనా క్రికెటర్లు తమ వ్యాఖ్యల పట్ల జాగ్రత్తగా ఉండాలని... భారత్, పాకిస్థాన్ మధ్య సామరస్యతను చెడగొట్టే విధంగా వారి వ్యాఖ్యలు ఉండరాదని అక్తర్ హితవు పలికాడు. రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే అవకాశమే ఉంటే, అందుకు తాను వారధిలా కీలకపాత్ర పోషిస్తానని ఉద్ఘాటించాడు. ఇది సోషల్ మీడియా యుగం అని, సెహ్వాగ్ కాస్త జాగ్రత్తగా మాట్లాడడం మంచిదని అక్తర్ సలహా ఇచ్చాడు.


More Telugu News