మేం స్వయంగా పర్యవేక్షించడం సాధ్యం కాదు.. దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టు

మేం స్వయంగా పర్యవేక్షించడం సాధ్యం కాదు.. దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసుపై సుప్రీంకోర్టు
  • తెలంగాణ హైకోర్టే చర్యలు తీసుకుంటుందని స్పష్టీకరణ
  • హైకోర్టు, కింది స్థాయి కోర్టులో ఏం జరుగుతోందో తెలియదని వ్యాఖ్య
  • సర్కారుతో రాష్ట్ర న్యాయవాదులు చర్చించి రావాలని సూచన
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. దిశ ఎన్ కౌంటర్ కేసును సుప్రీంకోర్టు ప్రత్యేకంగా పర్యవేక్షించలేదని, కాబట్టి తదుపరి విచారణ, చట్టపరంగా తీసుకునే చర్యలపై తెలంగాణ హైకోర్టే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. ఎన్ కౌంటర్ ఘటనపై నియమించిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక ఇచ్చిందని, పలు సూచనలను చేసిందని పేర్కొంది. 

హైకోర్టు, కింది స్థాయి కోర్టుల్లో ఏం జరుగుతోందో తమకు తెలియదని, తాము నివేదిక పంపుతామని తెలిపింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసుకు సంబంధించిన నివేదిక చూడకుండా వాదనలను వినడం, ఆ కేసును సుప్రీంకోర్టే స్వయంగా పర్యవేక్షించడం సాధ్యం కాని పని అని చెప్పింది. తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాదులు ఆ రాష్ట్ర సర్కారుతో చర్చించి రావాలని సూచించింది. 

2019 నవంబర్ 27న చటాన్ పల్లి వద్ద దిశ అనే యువతిని నలుగురు యువకులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను చంపేసి మృతదేహాన్ని తొండుపల్లిగేట్ వద్ద ఉన్న బ్రిడ్జి కింద తగులబెట్టారు. సంచలనం సృష్టించిన ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. చటాన్ పల్లి వద్దే అదే ఏడాది డిసెంబర్ 6న జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు నిందితులు చనిపోయారు.  

దీనిపైనా పెద్ద దుమారమే రేగింది. ఎన్ కౌంటర్ జరిగిన ఆరు రోజుల తర్వాత సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ విఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల విచారణ కమిటీని నియమించింది. ఇటీవలే సుప్రీంకోర్టుకు కమిషన్ నివేదిక ఇచ్చింది.


More Telugu News