ప్రతిసారి అంబానీ, అదానీలను విమర్శించలేరు: కాంగ్రెస్ పై హార్దిక్ పటేల్ ఫైర్

  • అంబానీ, అదానీ కష్టపడి అత్యున్నత స్థాయికి చేరుకున్నారు
  • మోదీపై కోపాన్ని వీరిపై తీర్చుకుంటే ఎలా?
  • కాంగ్రెస్ లో ఉండి మూడేళ్లు వృథా చేసుకున్నా
గుజరాత్ పటిదార్ నేత హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోని అగ్ర పారిశ్రామికవేత్తలైన ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీలపై పదేపదే విమర్శలు గుప్పించడం సరికాదని అన్నారు. వీరిద్దరూ ఎంతో కష్టపడి అత్యున్నత స్థాయికి చేరుకున్నారని... ప్రధాని మోదీ రాష్ట్రం గుజరాత్ కు చెందిన వ్యక్తులు అనే కారణంతో వీరిని టార్గెట్ చేయకూడదని చెప్పారు. 

ఏ బిజినెస్ మేన్ అయినా వారి కష్టంతోనే ఎదుగుతారని హార్దిక్ అన్నారు. ప్రతిసారి అంబానీ, అదానీలను విమర్శించలేరని చెప్పారు. గుజరాత్ కు చెందిన వ్యక్తులయినంత మాత్రాన... మోదీపై ఉన్న కోపాన్ని వీరిపై తీర్చుకుంటే ఎలాగని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుందని అన్నారు. 

కాంగ్రెస్ లో ఉండి తాను మూడేళ్ల విలువైన సమయాన్ని వృథా చేసుకున్నానని హార్దిక్ చెప్పారు. కాంగ్రెస్ లో లేకపోయినా... గుజరాత్ కు తాను మరింత మెరుగైన సేవ చేస్తానని అన్నారు. కాంగ్రెస్ కులతత్వంతో నిండిన పార్టీ అని... గుజరాత్ వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. 

మరోవైపు కాంగ్రెస్ నేతలు హార్దిక్ పటేల్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. హార్దిక్ పచ్చి అవకాశవాది అని వారు దుయ్యబట్టారు. గత ఆరేళ్లుగా బీజేపీతో హార్దిక్ ఉంటున్నారని... ఆయనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు తాను బీజేపీతో టచ్ లో ఉన్నాననే ఆరోపణలను హార్దిక్ ఖండించారు. కాంగ్రెస్ కు చెందిన కొందరు నేతలే గత రెండేళ్లుగా బీజేపీతో కలిసి ఉన్నారని ఎద్దేవా చేశారు.


More Telugu News