రేపటి నుంచి ఏపీలో మండిపోనున్న ఎండలు.. ఐదారు రోజులు వడగాలులు వీస్తాయంటూ హెచ్చరిక

  • మయన్మార్ సమీపంలో అల్పపీడనం
  • నేడు ఇది బలపడి మయన్మార్ తీరం దిశగా పయనం
  • 27, 28 తేదీల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు
  • 1న రాయలసీమలో ప్రవేశం
కోస్తాలో రేపటి నుంచి ఉష్ణోగ్రతలు అమాంతం పెరగనున్నాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. అలాగే, శనివారం నుంచి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదు కావడంతోపాటు ఐదారు రోజులపాటు వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపారు. మయన్మార్‌కు ఆనుకుని గల్ఫ్ ఆఫ్ మార్టాబన్ పరిసరాల్లో నిన్న అల్పపీడనం ఏర్పడింది. నేడు ఇది మరింత బలపడి ఈశాన్యంగా మయన్మార్ తీరం దిశగా పయనించనుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో దక్షణ, మధ్య భారతం మీదుగా గాలులు అల్పపీడనం దిశగా వెళ్లనున్నట్టు చెప్పారు. 

ఫలితంగా రేపటి నుంచి ఏపీ మీదుగా పడమర గాలులు వీస్తాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. మయన్మార్ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం వల్ల నైరుతి రుతుపవనాల రాకకు వాతావరణం అనుకూలంగా మారిందన్నారు. అలాగే, ఈ నెల 27 లేదంటే 28 తేదీల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని, ఈ నెలాఖరు నాటికి లేదంటే జూన్ 1న రాయలసీమలో ప్రవేశిస్తాయని తెలిపారు. ఆ తరువాత ఒకటి రెండు రోజుల్లో కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయిని అధికారులు వివరించారు.


More Telugu News