పామాయిల్ ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తేస్తున్న ఇండోనేషియా.. దిగి రానున్న ధరలు

  • తమ దేశంలో నూనె కొరతను నివారించేందుకు ఎగుమతులను నిషేధించిన ఇండోనేషియా
  • ఆ దేశం నుంచి పెద్ద ఎత్తున నూనెను దిగుమతి చేసుకుంటున్న భారత్
  • ఎగుమతులు నిలిచిపోవడంతో దేశీయంగా పెరిగిన నూనె ధరలు
  • ఈ నెల 23 నుంచి ఎగుమతులపై ఉన్న నిషేధం ఎత్తివేస్తున్నట్టు ప్రకటించిన ఇండోనేషియా
పెరిగిన వంటనూనెల ధరలతో అల్లాడిపోతున్న సామాన్యులకు ఇది శుభవార్తే. అతి త్వరలోనే ఈ ధరలు దిగి రానున్నాయి. పామాయిల్ ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని ఇండోనేషియా నిర్ణయించింది. ఈ నెల 23 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఈ మేరకు ఆ దేశాధ్యక్షుడు జోకో విడొడొ తెలిపారు. పామాయిల్ ఎగుమతులు మళ్లీ జోరందుకుంటే ఆయిల్ ధరలు క్రమంగా దిగి వచ్చే అవకాశం ఉంది. 

ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న పామాయిల్‌లో ఇండోనేషియా, మలేషియాల నుంచే 85 శాతం వస్తోంది. అయితే, తమ దేశంలో పెరిగిపోతున్న నూనె కొరతను నివారించడంతోపాటు ధరలకు ముకుతాడు వేసేందుకు ఇండోనేషియా తమ దేశం నుంచి ఎగుమతులను నిషేధించింది. దీంతో ఆ దేశం నుంచి అధికంగా నూనెను దిగుమతి చేసుకునే భారత్‌లో ఒక్కసారిగా ధరలు పెరిగి సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. ఇప్పుడు ఇండోనేషియా తిరిగి ఎగుమతులకు అనుమతులివ్వడంతో నూనె ధరలు మళ్లీ దిగి వచ్చే అవకాశం ఉంది.


More Telugu News