మాజీ మంత్రి నారాయ‌ణ కూతుళ్లు, అల్లుడి ముంద‌స్తు బెయిల్‌పై విచార‌ణ వాయిదా

  • టెన్త్ క్వశ్చ‌న్ పేప‌ర్ల లీకేజీలో ముంద‌స్తు బెయిల్ కోసం పిటిష‌న్లు
  • నాలుగు రోజుల క్రిత‌మే హైకోర్టులో శ‌ర‌ణి, సింధూరి, పునీత్ పిటిష‌న్లు
  • ప్ర‌భుత్వం త‌ర‌ఫున అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ హాజ‌ర‌వుతార‌న్న పీపీ
  • విచార‌ణ‌ను వ‌చ్చే గురువారానికి వాయిదా వేసిన హైకోర్టు
టెన్త్ క్వ‌శ్చ‌న్ పేప‌ర్ల లీకేజీ వ్య‌వ‌హారంలో టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి నారాయ‌ణ కూతుళ్లు శ‌ర‌ణి, సింధూరిల‌తో పాటు ఆయ‌న అల్లుడు పునీత్ దాఖ‌లు చేసుకున్న ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ల‌పై విచార‌ణ వ‌చ్చే గురువారానికి వాయిదా పండింది. నారాయ‌ణ కుటుంబం ఆధ్వ‌ర్యంలోని నారాయ‌ణ విద్యా సంస్థ‌ల నుంచే క్వ‌శ్చ‌న్ పేప‌ర్లు లీక‌య్యాయ‌న్న కేసులో ఇప్ప‌టికే నారాయ‌ణ‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేయ‌గా...ఆయ‌న‌కు చిత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో నారాయ‌ణ విద్యా సంస్థ‌ల వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న శ‌ర‌ణి, సింధూరి, పునీత్ త‌మ‌ను అరెస్ట్ చేస్తారేమోనన్న భావ‌న‌తో నాలుగు రోజుల క్రితం ముంద‌స్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. వీరి పిటిష‌న్ల‌పై ఇరు వ‌ర్గాల వాద‌న‌ల‌ను బుధ‌వార‌మే విన్న హైకోర్టు... గురువారం త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డిస్తాన‌ని చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే గురువారం నాటి విచార‌ణ‌లో భాగంగా ఈ విచార‌ణ‌కు ప్ర‌భుత్వం త‌ర‌ఫున అడ్వొకేట్ జ‌న‌రల్ హాజ‌ర‌వుతార‌ని ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ చెప్ప‌డంతో ఈ విచార‌ణ‌ను వ‌చ్చే గురువారానికి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణ‌యం తీసుకుంది.


More Telugu News