నామినేష‌న్ వేసిన వద్దిరాజు!.. ఎంపీగా రెండేళ్లు మాత్ర‌మే అవ‌కాశం!

  • బండ ప్ర‌కాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానం
  • ఆ స్థానంలో ఎన్నిక కోసం వ‌ద్దిరాజు నామినేష‌న్‌
  • ఏక‌గ్రీవంగానే ఎన్నిక కానున్న వ‌ద్దిరాజు
తెలంగాణ కోటాలో ఇప్ప‌టికే ఖాళీ అయిన రాజ్య‌స‌భ స్థానం ఉప ఎన్నిక‌ల నామినేష‌న్ గ‌డువు గురువారంతో ముగినుంది. దీంతో ఈ స్థానానికి టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా వ‌ద్దిరాజు ర‌విచంద్ర (గాయ‌త్రి ర‌వి) గురువారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ ఎన్నిక‌ల్లో వ‌ద్దిరాజు ఏక‌గ్రీవంగానే ఎన్నిక కానున్నారు. అసెంబ్లీలో ఆయా పార్టీల బ‌లాబ‌లాల ఆధారంగా ఎన్నిక జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో క్లియ‌ర్ మెజారిటీతో టీఆర్ఎస్ సాగుతున్నందున ఆ పార్టీ అభ్య‌ర్థిగా వ‌ద్దిరాజు ఎన్నిక లాంఛ‌న‌మే. 

ఇదిలా ఉంటే... వ‌ద్దిరాజు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కేవ‌లం రెండేళ్లు మాత్ర‌మే కొన‌సాగ‌నున్నారు. ఎందుకంటే... తెలంగాణ కోటా నుంచి రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన బండ ప్ర‌కాశ్ ఈ ప‌ద‌విలో నాలుగేళ్ల పాటు కొన‌సాగి... ఇటీవ‌లే ఆ ప‌ద‌వికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. బండ ప్ర‌కాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికే ఉప ఎన్నిక జ‌రుగుతోంది. ఈ ఎన్నిక‌లో గెలిచిన వారు ఎవ‌రైనా... బండ ప్ర‌కాశ్ రాజీనామా చేశాక మిగిలిన కాలం మేర‌కు మాత్ర‌మే రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగుతారు. ఈ లెక్క ఆధారంగానే వ‌ద్దిరాజు రాజ్యస‌భ స‌భ్యుడిగా కేవ‌లం రెండేళ్లు మాత్ర‌మే కొన‌సాగనున్నారు.


More Telugu News