రాజీనామా త‌ర్వాత కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించిన‌ హార్దిక్ ప‌టేల్‌

  • కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హార్దిక్ ప‌టేల్‌
  • కాంగ్రెస్ కార‌ణంగా రాజ‌కీయంగా మూడేళ్లు న‌ష్ట‌పోయాన‌ని ఆవేద‌న‌
  • అంబానీ, అదానీల‌పై కాంగ్రెస్ విమ‌ర్శ‌లు స‌రికాద‌న్న ప‌టీదార్ ఉద్య‌మ నేత‌
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గుజ‌రాత్ ప‌టీదార్ ఉద్య‌మ నేత హార్దిక్ ప‌టేల్ హ‌స్తం పార్టీపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. బుధ‌వారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన హార్దిక్... త్వ‌ర‌లోనే బీజేపీలో చేర‌తారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ దిశ‌గా ఆయ‌న కాంగ్రెస్ పార్టీపై చేసిన విమ‌ర్శ‌లు, అందులోనే ప్ర‌ధాని మోదీపై విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను ప్ర‌స్తావిస్తూ హార్దిక్ చేసిన వ్యాఖ్య‌లు ఆ ఊహాగానాలు నిజ‌మేన‌న్న సంకేతాలు ఇస్తున్నాయి. 

ఈ సంద‌ర్భంగా హార్దిక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార‌ణంగా రాజ‌కీయంగా తాను మూడేళ్ల పాటు న‌ష్ట‌పోయాన‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార‌ణంగా తాను గుజ‌రాత్‌కు ఏమీ చేయ‌లేక‌పోయాన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్‌లో ఉన్నంత కాలం ప‌నిచేసే అవ‌కాశ‌మే ద‌క్క‌లేద‌న్న హార్దిక్‌.. కాంగ్రెస్ పార్టీ కూడా త‌న‌కు ఎలాంటి బాధ్య‌త‌ను అప్ప‌గించ‌లేద‌ని విమ‌ర్శించారు. 

ఇక ప్ర‌ధాని మోదీని టార్గెట్ చేస్తూ... ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌కు చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌లు ముఖేశ్ అంబానీ, గౌత‌మ్ అదానీల‌పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను కూడా హార్దిక్ తిప్పికొట్టారు. ఏ పారిశ్రామిక‌వేత్త అయినా వారి క‌ఠోర శ్ర‌మ‌తోనే ఎదుగుతార‌ని ఆయ‌న అన్నారు. మోదీ గుజ‌రాత్‌కు చెందినంత మాత్రాన‌.. అదే రాష్ట్రానికి చెందిన అంబానీ, అదానీల‌ను టార్గెట్ చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌బ‌బ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇదంతా కేవ‌లం ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌డ‌మేన‌ని హార్దిక్ ప‌టేల్ ఆరోపించారు.


More Telugu News