ఐపీఎల్ లో సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ చేరాలంటే ఇలా జరగాలి..!

  • ముగింపు దశకు ఐపీఎల్
  • లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్ లు మిగిలున్న వైనం
  • ఈ నెల 22న చివరి మ్యాచ్ ఆడనున్న సన్ రైజర్స్
  • గెలిచినా... ముందంజకు స్వల్ప అవకాశాలు!
ఐపీఎల్ 15వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. లీగ్ దశలో మరో నాలుగు మ్యాచ్ లు మాత్రమే మిగిలున్నాయి. ఆ తర్వాత ప్లే ఆఫ్ దశ, ఆపై ఫైనల్ జరగనున్నాయి. కొత్త జట్లు అయినప్పటికీ అమోఘంగా రాణించిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్తులు ఖాయం చేసుకోగా, మరో రెండు బెర్తుల కోసం పోరు రసవత్తరంగా మారింది. 

వరుసగా ఐదు మ్యాచ్ ల్లో ఓడి మళ్లీ గెలుపుబాట పట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్లే ఆఫ్ ఆశలు మిణుకుమిణుకుమంటున్నాయి. సన్ రైజర్స్ ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. ఈ నెల 22న సన్ రైజర్స్ జట్టు పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే సన్ రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. 

కేవలం సన్ రైజర్స్ గెలిస్తేనే సరిపోదు... ఇతర జట్ల మధ్య జరిగే మ్యాచ్ ల ఫలితాలు కూడా అనుకూలంగా రావాల్సి ఉంటుంది. అదే సమయంలో రన్ రేట్ కూడా భారీగా పెరగాలి. అప్పుడే సన్ రైజర్స్ నాకౌట్ దశకు ముందంజ వేస్తుంది.

సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ రోడ్ మ్యాప్ ఇలా...

  • ఈ నెల 19న గుజరాత్ టైటాన్స్ తో పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓడిపోవాలి.
  • ఈ నెల 21న జరిగే మ్యాచ్ లో ముంబయి చేతిలో ఢిల్లీ ఓడిపోవాలి.
  • ఈ నెల 22న పంజాబ్ కింగ్స్ పై సన్ రైజర్స్ గెలవాలి. దాంతో సన్ రైజర్స్ 14 పాయింట్లతో ఢిల్లీ, బెంగళూరు జట్లతో పాటు నాలుగో స్థానంలో నిలుస్తుంది. అప్పుడు రన్ రేట్ కీలకమవుతుంది. 
  • ప్రస్తుతానికి ఢిల్లీ, బెంగళూరు జట్ల రన్ రేట్ హైదరాబాద్ జట్టు రన్ రేట్ కంటే చాలా ఎక్కువ.
  • ఈ సమీకరణాలన్నీ పరిశీలిస్తే సన్ రైజర్స్ కు అత్యంత స్వల్ప అవకాశాలే కనిపిస్తున్నాయి.



More Telugu News