టీఆర్ఎస్ రాజ్య‌స‌భ అభ్యర్థుల‌పై కేఏ పాల్ తీవ్ర ఆరోప‌ణ‌లు

  • ఒక‌రు మైనింగ్ డాన్‌, ఇంకొక‌రు స్కాంలో ప‌ట్టుబ‌డ్డ వ్య‌క్తి, మ‌రొక‌రు భూక‌బ్జాదారుడన్న పాల్ 
  • ఈ ముగ్గురికి ఏ అర్హ‌త ఉంద‌ని రాజ్య‌స‌భ సీట్లిచ్చారని ప్రశ్న 
  • వీరి అభ్య‌ర్థిత్వాల‌ను ర‌ద్దు చేసి అమ‌ర‌వీరుల కుటుంబాల‌కివ్వాల‌న్న పాల్‌
తెలంగాణ కోటాలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న మూడు రాజ్య‌స‌భ సీట్ల‌కు టీఆర్ఎస్ బుధ‌వారం ముగ్గురు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. హెటిరో డ్ర‌గ్స్ అధినేత పార్థ‌సార‌ధి రెడ్డి, న‌మ‌స్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోద‌ర‌రావు, గ్రానైట్ ప‌రిశ్ర‌మ‌ల అధినేత వద్దిరాజు ర‌విచంద్ర (గాయ‌త్రి ర‌వి)ల‌ను టీఆర్ఎస్ ఎంపిక చేసింది. ఈ ముగ్గురిపై ప్ర‌ముఖ క్రైస్త‌వ మ‌త‌బోధ‌కుడు, ప్రజాశాంతి అధ్య‌క్షుడు కేఏ పాల్ గురువారం తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. 

ఈ ముగ్గురిలో ఒక‌రేమో మైనింగ్ డాన్‌, మరొక‌రేమో రూ.500 కోట్ల స్కామ్‌లో ప‌ట్టుబ‌డిన వ్య‌క్తి, ఇంకొక‌రేమో భూక‌బ్జాలు చేసిన వ్య‌క్తి అంటూ కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ ముగ్గురికి ఏ అర్హ‌త ఉంద‌ని రాజ్య‌స‌భ సీట్లిచ్చారంటూ ఆయ‌న ప్ర‌శ్నించారు. తెలంగాణ‌లోని 1‌200 అమ‌ర‌వీరుల కుటుంబాల్లో రాజ్య‌స‌భ‌కు పంపే అర్హ‌త ఉన్న వారు ఒక్క‌రూ లేరా? అని కూడా కేఏ పాల్ ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికైనా మించిపోయింది లేద‌ని, త‌క్ష‌ణ‌మే వీరి ముగ్గురు అభ్య‌ర్థిత్వాల‌ను ర‌ద్దు చేసి ఆ మూడు రాజ్య‌స‌భ సీట్ల‌ను అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ఇవ్వాల‌ని పాల్ డిమాండ్ చేశారు.


More Telugu News