మధుమేహంలోకి అడుగు పెడుతున్నాం.. అనడానికి సంకేతాలు ఇవి...! 

  • చర్మంపై గోధుమ రంగులో మచ్చలు కనిపించొచ్చు
  • ఆకలి వేయడం.. త్వరగా అలసట భావన రావచ్చు 
  • ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం ఉంటుంది 
  • కంటి చూపు తగ్గిపోవడాన్ని కూడా సంకేతాలుగానే చూడాలి
మధుమేహం జీవనశైలి సమస్య. వంశపారంపర్యంగా జన్యు సంబంధితంగా రావచ్చు. జీవనశైలి, ఆహార అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల కూడా రావచ్చు. కారణాలు ఏవైనా ఒక్కసారి మధుమేహం (డయాబెటిస్, చక్కెర వ్యాధి) వచ్చిందీ అంటే.. ఇన్సులిన్ ఉత్పత్తి, రక్తంలో గ్లూకోజ్ గతి తప్పినట్టు అర్థం చేసుకోవాలి. అప్పటి నుంచి నియమబద్ధంగా ఆహార, నిద్ర వేళలు పాటించాల్సి ఉంటుంది. లేదంటే ఎన్నో అవయవాల పనితీరు దెబ్బతిని ప్రాణాంతకం కావచ్చు. 

మరి మధుమేహం వచ్చినట్టు ఎలా తెలుస్తుంది..? వచ్చిన తర్వాత అనే కాదు.. మధుమేహానికి దగ్గరగా ఉన్నామని తెలియజేస్తూ మన శరీరం పలు సంకేతాలను ఇస్తుంది. వాటిని గమనించుకుంటే చాలు.. జాగ్రత్తలు తీసుకోవచ్చు.

చర్మం రంగు మారిపోవడం
మధుమేహం వస్తోందనడానికి చర్మంపై గుర్తులు కనిపిస్తాయి. దీన్నే డయాబెటిక్ డెర్మోపతి అంటారు. ఇందులో చర్మంపై చిన్నగా, బ్రౌన్ రంగులో మచ్చలు కనిపిస్తాయి. ముఖ్యంగా కాళ్ల ముందు భాగంలో ఇవి వస్తాయి. మెడ, చంకలు, గజ్జల్లోనూ ఈ గుర్తులు కనిపిస్తాయి.

ఆకలి, అలసట
మనం తీసుకునే ఆహారం గ్లూకోజుగా మారి, అది కణాలకు శక్తిగా వెళుతుంది. అయితే మన కణాలు గ్లూకోజును శక్తిగా మార్చుకోవడానికి ఇన్సులిన్ అవసరం. ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గినా.. లేక శరీరంలోని ఇన్సులిన్ ను కణాలు తీసుకోకుండా నిరోధకత ఏర్పడినా.. అప్పుడు గ్లూకోజు శక్తిగా మారదు. దాంతో కణాలకు శక్తి అందదు. ఫలితంగా మనం తీసుకునే ఆహారం నుంచి సరిపడా శక్తి అందనందున అలసిపోయినట్టు, ఆకలి అవుతున్నట్టు అనిపిస్తుంది.

అతి మూత్రం.. చెమట
ఒక వ్యక్తి రోజులో సాధారణంగా నాలుగు నుంచి ఏడు సార్లు మూత్ర విసర్జన చేయాలి. కానీ మధుమేహం ఉన్న వారు, మధుమేహం రావడానికి ముందుస్తు దశలో (ప్రీ డయాబెటిస్) ఉన్న వారు ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావచ్చు. కిడ్నీ ద్వారా వెళ్లే సమయంలో ఇన్సులిన్ ను మన శరీరం తిరిగి గ్రహిస్తుంది. 

అయితే, మధుమేహం వల్ల రక్తంలో గ్లూకోజు పెరిగిపోతే అప్పుడు కిడ్నీలు (మూత్ర పిండాలు) ఇన్సులిన్ ను పూర్తి స్థాయిలో రికవరీ చేయలేవు. దీంతో మరింతగా మూత్ర విసర్జనకు శరీరం సంకేతాలు పంపిస్తుంటుంది. అందుకని ఎక్కువ సార్లు వెళ్లాల్సి వస్తుంది. తరచూ మూత్ర విసర్జన చేయడం వల్ల అధిక దాహం కూడా వేస్తుంది. అలా తాగడం వల్ల మరిన్ని సార్లు విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది.

నోరు ఎండిపోవడం
నోరు ఎండి పోవడాన్ని జెరోస్టోమియా అని అంటారు. నోటిలో తగినంత తేమ లేకపోవడంగా దీన్ని చెబుతారు. ఎందుకంటే మధుమేహంలో శరీరం ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు ప్రేరేపిస్తుంది కనుక. దీనివల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. అందువల్ల నోటిలోపల తగినంత లాలాజలం లేనట్టు, ఎండిపోయినట్టు అనిపించొచ్చు. 

చూపు మసక
మధుమేహం వల్ల కంటి చూపు కూడా మసకబారుతుంది. ప్రీ డయాబెటిస్ దశలో 8 శాతం మంది డయాబెటిక్ రెటినోపతి బారిన పడుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకని కంటి చూపు మసకబారుతున్నా మధుమేహం పరీక్ష చేయించుకోవాలి.


More Telugu News