ఆన్ లైన్ గేమ్స్, క్యాసినో మరింత ప్రియం.. 28 శాతానికి పెరగనున్న పన్ను

  • సిఫారసు చేసిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందం
  • తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం
  • పందెం కట్టే మొత్తంపై పడనున్న పన్ను
ఆన్ లైన్ గేములు ఆడేవారు, క్యాసినో, రేసు కోర్సులు ఆడే వారి నడ్డి విరిగేలా పన్ను పెరగనుంది. ఇప్పటి వరకు ఈ సేవలపై 18 శాతం జీఎస్టీ అమల్లో ఉంది. దీన్ని 28 శాతానికి పెంచాలని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల మండలి జీఎస్టీ కౌన్సిల్ కు సిఫారసు చేసింది. జీఎస్టీ తదుపరి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఢిల్లీలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ పన్ను ఎలా విధించాలన్నదీ మంత్రుల బృందం సూచింది. బెట్టింగ్ సమయంలోనే బెట్టింగ్ అమౌంట్ పై ఈ పన్ను విధించాలన్నది సిఫారసు. దీనివల్ల గేమింగ్ ద్వారా వచ్చే లాభాలపై కాకుండా.. స్థూల ఆదాయంపై పన్ను పడనుందని తెలుస్తోంది. ఈ లెక్కన గేమింగ్ పరిశ్రమ మొత్తం ఆదాయం పన్ను పరిధిలోకి రానుంది. ఉదాహరణకు క్యాసినోపై రూ.100 బెట్టింగ్ కట్టారనుకుంటే.. ఈ మొత్తంపై రూ.28 రూపాయల పన్ను కలుపుకుని అప్పుడు రూ.128 చెల్లించాల్సి వస్తుంది. గుర్రపు పందేల పైన ఇంతే. గెలుచుకున్న అమౌంట్ పై కాకుండా పందెం మొత్తంపై పన్ను పడుతుంది.  

పన్ను పెంచొద్దంటూ ఆన్ లైన్ స్కిల్ గేమింగ్ పరిశ్రమ ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించింది. మన చట్టాల పరిధిలో కాకుండా, వేరే దేశాల నుంచి నడుస్తున్న వాటిని ప్రోత్సహించినట్టు అవుతుందని, పరిశ్రమ ఆదాయం కోల్పోవడమే కాకుండా.. ప్రభుత్వానికి కూడా పన్ను ఆదాయం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.


More Telugu News