ఒకే మునిసిప‌ల్ కార్పొరేష‌న్‌గా ఢిల్లీ!... కేంద్రం నోటిఫికేష‌న్ విడుద‌ల‌!

  • ప్రస్తుతం ఢిల్లీలో 3 మునిసిప‌ల్ కార్పొరేష‌న్లు
  • ఒకే మునిసిప‌ల్ కార్పొరేష‌న్ కింద‌కు 3 కార్పొరేష‌న్లు
  • అమ‌లులోకి ఢిల్లీ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ స‌వ‌ర‌ణ చ‌ట్టం
  • ఈ నెల 22న ఢిల్లీ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఏర్పాటు
దేశ రాజ‌ధాని ఢిల్లీకి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం న‌గ‌రంలో మూడు మునిసిప‌ల్ కార్పొరేష‌న్లు ఉండ‌గా.. ఇక‌పై మూడింటిని విలీనం చేస్తూ ఢిల్లీ న‌గ‌రం మొత్తాన్ని ఒకే మునిసిప‌ల్ కార్పొరేష‌న్ కింద‌కు తీసుకురానున్నారు. ఇదివ‌ర‌కే ప్ర‌తిపాదించిన ఢిల్లీ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ స‌వ‌ర‌ణ చ‌ట్టం-2022ను కేంద్ర ప్ర‌భుత్వం అమ‌ల్లోకి తీసుకువ‌చ్చింది. 

ఈ మేర‌కు ఢిల్లీలోని మూడు మునిసిప‌ల్ కార్పొరేష‌న్ల ఏకీక‌ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం బుధ‌వారం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్ ప్ర‌కారం ఈ నెల 22 నుంచి ఢిల్లీ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఏర్పాటు కానుంది. ఢిల్లీలోని 3 మునిసిప‌ల్ కార్పొరేష‌న్ల‌ను విలీనం చేసే దిశ‌గా కేంద్రం చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తీవ్రంగా వ్య‌తిరేకించిన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల్లో ల‌బ్ధి కోస‌మే ఢిల్లీ మునిసిప‌ల్ స‌వ‌ర‌ణ చ‌ట్టాన్ని కేంద్రం ప్ర‌తిపాదిస్తోందని ఆయ‌న ఆరోపించారు. అయితే ఢిల్లీ ప్ర‌భుత్వం వ్య‌తిరేక‌త‌ను ఎంత‌మాత్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోని కేంద్రం తాను అనుకున్న ప‌నిని పూర్తి చేసేసింది.


More Telugu News