త‌ల్లి స్మార్ట్ ఫోన్ తో ఆడుకుంటూ 31 చీజ్ బ‌ర్గ‌ర్ల‌కు ఆర్డ‌ర్ ఇచ్చిన రెండేళ్ల బాలుడు

  • అమెరికాలోని టెక్సాస్‌లో ఘ‌ట‌న‌
  • ఆ బ‌ర్గ‌ర్ల‌కు 62 డాల‌ర్ల బిల్లు అయ్యిందన్న త‌ల్లి
  • బ‌ర్గ‌ర్లు డెలివ‌రీ కాగానే వాటి ప‌క్క‌న త‌న కుమారుడిని ఉంచి ఫొటో
చిన్నారులు బొమ్మ‌లతో కాకుండా స్మార్ట్ ఫోన్ల‌తోనే అధికంగా ఆడుకుంటోన్న రోజులివి. ఈ క్ర‌మంలో అందులోని యాప్‌ల‌ను తెలియ‌కుండానే తెర‌వ‌డం వంటి ప‌నులు చేస్తున్నారు. ఇటువంటి ప‌నే చేశాడు అమెరికాలోని టెక్సాస్ కు చెందిన ఓ కుటుంబంలోని రెండేళ్ల చిన్నారి. ఓ స్మార్ట్ ఫోన్‌ను ప‌ట్టుకుని ఆడుకుంటోన్న రెండేళ్ల పిల్లాడు అందులోని ఫుడ్ డెలివ‌రీ యాప్ ను ఓపెన్ చేసి త‌న‌కు తెలియ‌కుండానే 31 చీజ్ బ‌ర్గ‌ర్లు ఆర్డ‌ర్ చేశాడు. 

దీంతో ఆ బ‌ర్గ‌ర్ల‌కు 62 డాల‌ర్ల బిల్లు అయ్యింది. చివ‌ర‌కు కొద్ది ఆల‌స్యంగా బ‌ర్గ‌ర్లు తీసుకొస్తామంటూ మెక్ డొనాల్డ్ సంస్థ వారు మెసేజ్ చేయ‌డంతో ఆ పిల్లాడి త‌ల్లి ఆ మెసేజ్ చూసి, త‌న ఫోనులోని ఆ ఫుడ్ డెలివ‌రీ యాప్ ను పరిశీలించింది. దీంతో త‌న కుమారుడు ఆ బ‌ర్గ‌ర్ల‌కు ఆర్డ‌ర్ ఇచ్చాడ‌ని తెలుసుకుంది. తాను ఇంట్లో కంప్యూట‌ర్ లో ప‌నులు చేసుకుంటుండ‌గా త‌న కుమారుడు స్మార్ట్ ఫోన్ ప‌ట్టుకుని ఉన్నాడ‌ని ఆమె తెలిపింది. 

చివ‌ర‌కు బ‌ర్గ‌ర్లు డెలివ‌రీ కాగానే, వాటి ప‌క్క‌న త‌న కుమారుడిని ఉంచి ఫొటో తీసింది. ఈ ఆర్డ‌ర్ తో త‌మ ఇంటికి రాగానే త‌న కుమారుడితో డెలివ‌రీ బాయ్ కి 16 డాల‌ర్ల టిప్ కూడా ఇప్పించిన‌ట్లు ఆ త‌ల్లి తెలిపింది. ఏమైనా, మ‌రోసారి త‌న కుమారుడు స్మార్ట్ ఫోన్‌లోని యాప్‌లు వాడ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటాన‌ని సామాజిక మాధ్య‌మాల్లో పేర్కొంది.


More Telugu News