టీమిండియా మా దేశానికి ఆడటానికి వస్తే కనక వర్షమే: జమైకా క్రికెట్ ప్రెసిడెంట్

  • భారత్-వెస్టిండీస్ మ్యాచ్ లను ఎక్కువ మంది చూస్తారన్న బిల్లీ హెవెన్
  • దీనివల్ల తమకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని వెల్లడి
  • భారత్ నుంచి 100 క్రికెట్ కిట్లు అందడం పట్ల ధన్యవాదాలు
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 100 క్రికెట్ కిట్లు అందించడం పట్ల జమైకా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విల్ ఫ్రెడ్ బిల్లీ హెవెన్ ధన్యవాదాలు తెలిపారు. తమ దేశ ప్రజలకు ఇది గర్వకారణంగా పేర్కొన్నారు.  భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు వచ్చి, సబీనా పార్క్ లో మ్యాచ్ ఆడినప్పుడే తమకు అత్యధిక  ఆదాయం వస్తుందని ఆయన అంగీకరించారు. 

‘‘కరీబియన్ లో భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే పోటీని ఎంతో మంది వీక్షిస్తారు. ఆ సమయంలో మాకు పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తుంది. వెస్టిండీస్ క్రికెట్ కు ఇదే అతిపెద్ద ఆదాయ వనరు’’ అని ఓ వార్తా సంస్థతో బిల్లీ హెవెన్ అన్నారు. నాలుగు రోజుల పర్యటనకు రాష్ట్రపతి కోవింద్ జమైకాలో పర్యటిస్తున్నారు. రెండు దేశాల మధ్య క్రికెట్ లో సహకారానికి నిదర్శనంగా క్రికెట్ కిట్లను బహుమానంగా అందించారు. 

‘‘ఇది వ్యక్తిగతంగా నేను, జమైకా క్రికెట్ సమాజం కూడా గర్వపడే సమయం. ఈ కానుక భారత్ నుంచి అందడం పట్ల మేము ఎంతో సంతోషిస్తున్నాం. 100 క్రికెట్ కిట్లలో సగాన్ని స్కూల్ విద్యార్థులకు ఇస్తాం. రెండు దేశాల మధ్య బంధాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది. జమైకాలో ఎంతో మంది యువ క్రికెటర్లు క్రికెట్ లో ఎంతో ఎత్తుకు ఎదగాలని, అంతిమంగా ఐపీఎల్ లో ఆండ్రూ రస్సెల్, క్రిస్ గేల్ మాదిరిగా ఆడాలని కోరుకుంటున్నారు’’ అని హెవెన్ చెప్పారు.


More Telugu News