వాయు కాలుష్యానికి దేశంలో ఏటా 24 లక్షల మంది బలి

  • 2019 గణాంకాలను వెల్లడించిన లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్     
  • అదే ఏడాది చైనాలో 22 లక్షల మంది మృతి
  • అమెరికాలో కాలుష్య మరణాలు 1.4 లక్షలు
  • ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 90 లక్షల మరణాలు 
వాయు కాలుష్యం పెద్ద సంఖ్యలో ప్రజలను ఏటా బలి తీసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల మంది చనిపోతున్నారు. లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. 2019 వాయు కాలుష్యం మరణాల వివరాలను ఈ అధ్యయనంలో భాగంగా పరిగణనలోకి తీసుకున్నారు. 2015లో నమోదైన కాలుష్య మరణాల స్థాయిలోనే 2019 గణాంకాలు కూడా ఉన్నాయి. 

భారత్ లో 2019లో 24 లక్షల మంది వాయు కాలుష్యానికి బలి కాగా.. చైనాలో 22 లక్షల మంది, అమెరికాలో 1,42,883 మంది మరణించారు. ఏటా సిగరెట్ తాగేవారు, సిగరెట్ తాగే వారు విడిచిన పొగను పీల్చిన వారి మొత్తం మరణాల స్థాయిలోనే వాయు కాలుష్య మరణాలు కూడా ఉండడం గమనించాలి. 90 లక్షల మరణాలు అంటే చాలా ఎక్కువని బోస్టన్ కాలేజీకి చెందిన గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్ అండ్ గ్లోబల్ పొల్యూషన్ అబ్జర్వేటరీ డైరెక్టర్ ఫిలిప్ లాండ్రిగన్ తెలిపారు.

కాలుష్య మరణాలు తగ్గకపోవడం విచారకరమని లాండ్రిగన్ పేర్కొన్నారు. వాయు, రసాయన కాలుష్యం పెరిగిపోతూనే ఉన్నట్టు చెప్పారు. ఈ మరణాలన్నీ నివారించతగినవేనని జార్జియా వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ డాక్టర్ లిన్ గోల్డ్ మ్యాన్ అన్నారు. వాస్తవ మరణాలు ఇంకా ఎక్కువే ఉండొచ్చన్నారు. 

‘‘ఈ మరణాలన్నీ కూడా కాలుష్యం వల్లేనని మరణ ధ్రువీకరణ పత్రాలలో పేర్కొనడం లేదు. గుండె జబ్బు, స్ట్రోక్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇతర ఊపిరితిత్తుల సమస్యలు, మధుమేహం వంటివాటిని కారణాలుగా చూపిస్తున్నారు. అయితే, ఇవన్నీ కాలుష్యంతో ముడిపడినవే’’ అని చెప్పారు. 



More Telugu News