తెలంగాణకు ఈ నెల 21 వరకు వర్ష సూచన.. ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం!

  • పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం
  • ఈదురు గాలులు వీస్తూ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
  • పశ్చిమ విదర్భ నుంచి ఉత్తర కేరళ వరకు కేంద్రీకృతమైన ద్రోణి
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు చల్లటి వార్తను అందించింది. ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈరోజు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

ఉత్తర-దక్షిణ ద్రోణి పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని కారణంగా రాగల 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పింది. నైరుతి రుతుపవనాల ఆగమనం మొదలు కావడంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయని తెలిపింది. 

మరోవైపు తెలంగాణలోని 20 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైన, 5 జిల్లాల్లో 38 డిగ్రీలకు పైన, 3 జిల్లాల్లో 37 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న రాత్రి అతి తక్కువగా మెదక్ జిల్లా కల్లకల్ లో 23.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ములుగు జిల్లా ఏటూరునాగారంలో నిన్న 2.56 సెంటీమీటర్ల వర్షం కురిసింది.


More Telugu News