జూలు విదిల్చిన హైదరాబాద్ బ్యాట‌ర్లు... ముంబై ల‌క్ష్యం 194 ప‌రుగులు

  • 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 193 ప‌రుగులు చేసిన హైద‌రాబాద్‌
  • 76 ప‌రుగుల‌తో స‌త్తా చాటిన రాహుల్ త్రిపాఠి
  • ర‌మ‌ణ్ దీప్ సింగ్‌కు 3 వికెట్లు
గెలిచి నిల‌వాల్సిన మ్యాచ్‌లో హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ బ్యాట‌ర్లు జూలు విదిల్చారు. ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో జ‌రుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లో భారీ స్కోరు చేసిన హైద‌రాబాద్ జ‌ట్టు ముంబై ఇండియన్స్‌కు 194 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. 

టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకోగా.. హైద‌రాబాద్ ఇన్నింగ్స్‌ను అభిషేక్ శ‌ర్మ (9), ప్రియ‌మ్ గార్గ్ (42) ప్రారంభించారు. అభిషేక్ శ‌ర్మ వికెట్ ఆదిలోనే ప‌డిపోయినా గార్గ్ మాత్రం బ్యాటును ఝుళిపించాడు. గార్గ్‌కు తోడైన రాహుల్ త్రిపాఠి(76) అయితే ఆకాశ‌మే హ‌ద్దు అన్న‌ట్టుగా చెలరేగాడు.  

హాఫ్ సెంచ‌రీకి చేరువ అవుతున్న స‌మ‌యంలోనే గార్గ్ అవుట్ అయినా 44 బంతుల‌ను ఎదుర్కొన్న త్రిపాఠి... 9 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో ఏకంగా 76 ప‌రుగులు రాబ‌ట్టాడు. గార్గ్ అవుటైన త‌ర్వాత త్రిపాఠితో జ‌త క‌లిసిన నికోల‌స్ పూర‌న్(38) కూడా స‌త్తా చాటాడు. వీరిద్ద‌రూ 172.72 స్ట్రయిక్ రేటుతో చెల‌రేగ‌డం గ‌మ‌నార్హం. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి హైద‌రాబాద్ జ‌ట్టు 193 ప‌రుగులు చేసింది.

ఇక బౌలింగ్ విష‌యానికి వ‌స్తే... హైద‌రాబాద్ బ్యాట‌ర్ల‌ను అడ్డుకునే దిశ‌గా ముంబై బౌలర్లు విఫ‌ల‌మ‌య్యారు. అభిషేక్‌ను మూడో ఓవ‌ర్‌లోనే అవుట్ చేసిన ముంబై... రెండో వికెట్ తీసేందుకు ఏకంగా ప‌దో ఓవ‌ర్ దాకా ఆగాల్సి వ‌చ్చింది. రెండు మంచి భాగ‌స్వామ్యాల‌ను అడ్డుకోవ‌డంలో ముంబై బౌలర్లు విఫ‌ల‌మ‌య్యారు. ర‌మ‌ణ‌దీప్ సింగ్ పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటుగా 3 వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. మ‌రికాసేప‌ట్లో 194 ప‌రుగుల ల‌క్ష్యంతో ముంబై త‌న ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నుంది.


More Telugu News