సూరత్, ఉదయ్ గిరి జలప్రవేశం... భారత్ అమ్ములపొదిలో అధునాతన యుద్ధనౌకలు

  • ముంబయి మజగావ్ డాక్ లో ఆవిష్కరణ
  • ప్రారంభించిన రాజ్ నాథ్ సింగ్
  • ఆత్మనిర్భర్ భారత్ కు ప్రతీకలు అని కితాబు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవచిస్తున్న ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా రెండు అధునాతన యుద్ధ నౌకలను ముంబయిలోని మజగావ్ డాక్ లో నిర్మించారు. దేశీయంగా తయారైన ఈ యుద్ధ నౌకల పేర్లు సూరత్, ఉదయ్ గిరి. వీటిని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు లాంఛనంగా జల ప్రవేశం చేయించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ సముద్ర భద్రత సామర్థ్యాన్ని ఇనుమడింపజేసే క్రమంలో, తమ ప్రభుత్వ అచంచలమైన నిబద్ధతకు ఈ రెండు యుద్ధనౌకలు ప్రతిరూపాలని పేర్కొన్నారు. కొవిడ్-19, రష్యా-ఉక్రెయిన్ అంశాలతో యావత్ ప్రపంచం సంక్షోభంలో ఉన్నప్పటికీ, ఆత్మనిర్భర్ భారత్ పై దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నామని వివరించారు. 

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన రెండు యుద్ధనౌకలను ఒకేసారి ఆవిష్కరించడం ఇదే ప్రథమం. అందుకు ముంబయిలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వేదికగా నిలిచింది. వీటిలో సూరత్ యుద్ధ నౌక పీ15బీ శ్రేణిలో 4వ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్. ఇక, ఉదయ్ గిరి పీ17ఏ తరగతిలో రెండో స్టెల్త్ ఫ్రిగేట్. వీటిని భారత నేవీకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ నావల్ డిజైన్ (డీఎన్ డీ) సంస్థ డిజైన్ చేయగా, ముంబయిలోని మజగావ్ డాక్ నిర్మించింది.


More Telugu News