గ్రూప్ నుంచి మీరు నిష్క్రమించినట్టు ఎవరికీ తెలియదు... వాట్సాప్ నుంచి త్వరలో కొత్త ఫీచర్

  • గ్రూప్ నుంచి నిష్క్రమిస్తే అందరికీ తెలిసిపోతున్న వైనం
  • వాట్సాప్ యూజర్ల గోప్యతకు ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయం 
  • కొత్త ఫీచర్ ను అభివృద్ధి చేస్తున్న మెసేజింగ్ ప్లాట్ ఫాం
సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా కనిపించే గ్రూపులు కొందరికి ఇబ్బందికరంగా అనిపిస్తుంటాయి. వాట్సాప్ లోనూ కొన్నిసార్లు గ్రూపుల్లో కొనసాగలేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు గ్రూప్ నుంచి నిష్క్రమించడం తప్ప యూజర్లకు మరో మార్గం ఉండదు.  

ఒకవేళ ఆ గ్రూప్ లో తమ బంధుమిత్రులు కూడా ఉంటే, యూజర్ల బాధ వర్ణనాతీతం. గ్రూప్ నుంచి బయటికి వెళ్లిపోతే బంధుమిత్రులు ఏమనుకుంటారోన్న బాధ పట్టిపీడిస్తుంటుంది. ఎందుకంటే, సదరు యూజర్ గ్రూప్ నుంచి నిష్క్రమిస్తే ఆ విషయం గ్రూప్ లో బట్టబయలవుతుంది. యూజర్ గ్రూప్ ను వీడినట్టు ఫోన్ నెంబర్ తో కూడిన మెసేజ్ కనిపిస్తుంది.

ఇకపై ఆ భయం అక్కర్లేదని వాట్సాప్ అభయం ఇస్తోంది. ఈ మేరకు కొత్త ఫీచర్ ను తీసుకువస్తోంది. మీరు గ్రూప్ ను వీడినా ఇకపై ఎవరికీ తెలియదు. ఓ గ్రూప్ నుంచి మీరు నిష్క్రమించడం మొత్తం సైలెంట్ గా జరిగిపోతుంది. కేవలం గ్రూప్ అడ్మిన్ కు మాత్రమే మీరు నిష్క్రమించినట్టు తెలుస్తుంది. 

యూజర్ల గోప్యతకు పెద్దపీట వేస్తూ వాట్సాప్ కొత్త ఫీచర్ ను అభివృద్ధి చేస్తోంది. వాట్సాప్ డెస్క్ టాప్ బీటా వెర్షన్లలో ఈ ఫీచర్ ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్టు ఓ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. త్వరలోనే వాట్సాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ బీటా వెర్షన్ల రూపంలోనూ ఈ ఫీచర్ పై పరిశీలన చేపట్టనున్నట్టు తెలుస్తోంది.


More Telugu News