తెలంగాణ టెన్త్ ప‌రీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు: మంత్రి స‌బితారెడ్డి

  • ఈ నెల 23 నుంచి జూన్ 1 వ‌ర‌కు టెన్త్ ప‌రీక్ష‌లు
  • ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై ఉన్న‌త స్థాయి స‌మీక్ష
  • డైరెక్ట‌ర్ కార్యాల‌యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తామ‌న్న స‌బిత‌
తెలంగాణ‌లో ఈ నెల 23 నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి తెలంగాణ స‌ర్కారు ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లుగా విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి సోమవారం ఆమె ఓ ఉన్న‌త స్థాయి స‌మీక్షా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

ప‌రీక్ష‌ల‌ను అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, ఎలాంటి పొర‌పాట్లకు తావు లేకుండా నిర్వ‌హించాల‌ని మంత్రి స‌బిత అధికారుల‌ను ఆదేశించారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ఎలాంటి స‌మ‌స్య ఉత్ప‌న్న‌మైనా వెంట‌నే ప‌రిష్కారం అయ్యేలా డైరెక్ట‌ర్ కార్యాల‌యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఆమె తెలిపారు. జూన్ 1 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ఈ ప‌రీక్ష‌ల‌కు మొత్తం 5,09,275 మంది విద్యార్థులు హాజ‌రు కానున్నార‌ని మంత్రి తెలిపారు.


More Telugu News