ఫామ్ కోల్పోయినా.. రోహిత్, కోహ్లీకి మద్దతు ప్రకటించిన గంగూలీ

  • వారి ఫామ్ పై నాకు ఆందోళన లేదు
  • వారు చక్కని ఆటగాళ్లు
  • తిరిగి సత్తా చాటుతారన్న బీసీసీఐ అధ్యక్షుడు
భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నుంచి మద్దతు లభించింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో రోహిత్ శర్మ ముంబై తరఫున, కోహ్లీ ఆర్సీబీ తరఫున ఆడుతున్నప్పటికీ.. వారు మునుపటి ఫామ్ లో లేరు. బ్యాట్ తో మంచి ఆటతీరును చూపించడంలో విఫలమయ్యారు. దీంతో వీరి భవిష్యత్తుపై ఎన్నో వ్యాఖ్యానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

‘‘రోహిత్ లేదా విరాట్ ఫామ్ గురించి నేను ఆందోళన చెందడం లేదు. వారు ఎంతో చక్కని ప్లేయర్లు. అంతేకాదు పెద్ద ఆటగాళ్లు కూడా. ప్రపంచ కప్పు చాలా దూరంలో ఉంది. టోర్నమెంట్ ఆరంభానికి ముందే వారు తిరిగి సత్తా చూపించే స్థాయికి చేరుకుంటారు’’ అని ఓ వార్తా సంస్థతో గంగూలీ పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ లో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. 

ఐపీఎల్ ముగిసిన తర్వాత జూన్ లో భారత్ జట్టు నాలుగు టీ20 మ్యాచ్ లలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఆ తర్వాత ఐర్లాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో వరుస వెంట టోర్నమెంట్ లు ఆడనుంది.


More Telugu News