బండి సంజయ్ కు ఫోన్ చేసి అభినందించిన మోదీ

  • రెండో విడత పాదయాత్రను పూర్తి చేసుకున్న బండి సంజయ్
  • 770 కిలోమీటర్లు నడిచానని మోదీకి తెలిపిన సంజయ్
  • నీతివంతమైన పాలన కోసం రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పిన వైనం
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ చాలా దూకుడుగా ముందుకు సాగుతోంది. ఆయన నాయకత్వంలో బీజేపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాదుతో పాటు టౌన్లలో ఆ పార్టీ తన బలాన్ని క్రమంగా పెంచుకుంటోంది. పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర పార్టీని జనాల్లోకి మరింతగా తీసుకెళ్లింది. శనివారం నాడు రెండో విడత పాదయాత్రను బండి సంజయ్ పూర్తి చేసుకున్నారు. ఈ యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచ్చేశారు. 

మరోవైపు, పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న సంజయ్ ను ప్రధాని మోదీ అభినందించారు. నిన్న ఆయన హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుండగా మోదీ నుంచి ఫోన్ వచ్చింది. పాదయాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందని సంజయ్ ను ప్రధాని ప్రశ్నించారు. 

మీ స్పూర్తి, సూచనలతో పాదయాత్రను చేపట్టానని... రెండు విడతల్లో 770 కిలోమీటర్లు నడిచానని మోదీకి బండి సంజయ్ తెలిపారు. నడిచింది తానే అయినా, నడిపించింది మాత్రం మీరేనని చెప్పారు. కేసీఆర్ పాలనపై ప్రజల్లో ఆగ్రహం ఉందని తెలిపారు. నీతివంతమైన పాలన కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. అమిత్ షా, జేపీ నడ్డాల రాకతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం మరింత పెరిగిందని అన్నారు. ఈ మేరకు పూర్తి వివరాలతో బీజేపీ ఒక ప్రకటనను విడుదల చేసింది.


More Telugu News