డిజిటల్ సాధనాలతో మధుమేహం నుంచి విముక్తి!

  • 180 రోజుల్లోపే సాధ్యపడుతుంది
  • ముంబైకి చెందిన ఎండోక్రైనాలజిస్ట్ జోషి అధ్యయనం
  • అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ వద్ద పత్రాలు దాఖలు
డిజిటల్ సాధనాల సాయంతో మధుమేహాన్ని చక్కగా నియంత్రించుకోవడమే కాదు.. ఈ మహమ్మారి నుంచి బయటకు రావడం సాధ్యపడుతుందని వైద్యులు చెబుతున్నారు. స్మార్ట్ వాచ్ లు, ఇతర సాధనాలతో వ్యాధి నుంచి పూర్తిగా విముక్తి పొందొచ్చని అంటున్నారు. ముంబైకి చెందిన ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ శశాంక్ జోషి అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ (శాన్ డియాజియో) వద్ద ఒక పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఐఐటీ మద్రాస్ స్టార్టప్ రూపొందించిన డిజిటల్ టెక్నాలజీ ప్లాట్ ఫామ్ టైప్-2 మధుమేహం నుంచి బయటకు రావడానికి కీలక పాత్ర పోషిస్తున్నట్టు వెల్లడించారు.

‘‘మధుమేహం నుంచి పూర్తిగా బయటకు రావచ్చు. ముఖ్యంగా ఏడేళ్లు అంతకంటే తక్కువ కాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి ఇది సాధ్యమవుతుంది’’ అన్నది ఆయన వాదన. 167 రోగులకు గాను 141 మంది (84.4 శాతం) డిజిటల్ టూల్స్ వినియోగించుకోవడం ద్వారా 180 రోజుల్లోపే మధుమేహం నుంచి బయటకు వచ్చినట్టు డాక్టర్ శశాంక్ జోషి తన పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. హెచ్ బీఏ1సీ పరీక్ష తెలుసు కదా. ఇది గత మూడు నెలల కాలంలో రక్తంలో సగటు గ్లూకోజు స్థాయిలు ఎలా ఉన్నది తెలిపే పరీక్ష. మధుమేహం నియంత్రణ మందులు మానేసిన మూడు నెలల తర్వాత కూడా ఈ పరీక్షా ఫలితం 6.5 లోపు చూపిస్తే.. దాన్ని మధుమేహం నుంచి బయటకు వచ్చినట్టుగా ఆయన పరిగణిస్తున్నారు. 

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) అన్నవి.. ఏ రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరుగుతున్నాయో బాధితులు తెలుసుకునేందుకు సాయపడుతున్నట్టు డాక్టర్ శశాంక్ జోషి తెలిపారు. డిజిటల్ టూల్స్ సాయంతో పేషెంట్ల బ్లడ్ గ్లూకోజును అదే పనిగా ట్రాక్ చేయవచ్చని, అలాగే వారి సంతోషం, ఒత్తిడులు, నిద్ర తీరును తెలుసుకోవడంతోపాటు మార్పులు చేసుకోవచ్చని సూచించారు.


More Telugu News